Soil Mafia in Kurnool: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం శకునాలలోని శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి, అర్చకుల జీవనోపాధి కోసం గ్రామ పెద్దలు.. దశాబ్దాల క్రితం 18 ఎకరాల భూమిని మాన్యంగా ఇచ్చారు. ఈ భూమి ద్వారా వచ్చే ఆదాయంతోనే.. అర్చకులు తరతరాలుగా ఆలయంలో దూపదీప నైవేద్య పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక.. స్థానిక నాయకుల కన్ను ఈ భూమిపై పడింది. రహదారులు, ఇళ్ల నిర్మాణాల కోసం మట్టి అవసరం ఉందంటూ.. ఆ భూమిలో తవ్వకాలు చేపట్టారు. ఇష్టారాజ్యంగా మట్టిని తవ్వుతూ కోట్లు గడిస్తున్నారు.
అక్రమ తవ్వకాలను అడ్డుకునేందుకు గ్రామ రైతులు, ప్రజలు అనేక ప్రయత్నాలు చేశారు. తహసీల్దారు, దేవదాయశాఖ అధికారులు, కలెక్టర్‌ను కలిసి ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చారు. వారి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. తవ్వకాలను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే.. పోలీసు కేసులు పెట్టిస్తామని బెదిరిస్తున్నట్లు రైతులు తెలిపారు. తుపాకీ చూపించి.. చంపేస్తామంటూ భయపెట్టినట్లు వాపోతున్నారు.
మట్టి తవ్వకాలతో దేవుడి మాన్యం భూమి వ్యవసాయానికి పనికి రాకుండా పోయింది. ఇకనైనా అధికారులు మట్టి తవ్వకాలను అడ్డుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. పాడైపోయిన భూమిలో అక్రమార్కులతోనే మట్టి పోయించి.. పునరుద్ధరింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు.