YSRCP Leaders Occupying Government Lands: అధికార పార్టీ నేతల ఆగడాలు ఎక్కువయ్యాయని ప్రజలు అంటున్నారు. కనిపించిన స్థలాలను కబ్జా చేయటమే కాకుండా.. దౌర్జన్యాలు, దాడులతో హడలెత్తిస్తున్నారని వాపోతున్నారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాలను బేఖాతరు చేస్తూ.. తమకు అడ్డే లేదన్నట్లు చెలరేగిపోతున్నారు. తాజాగా కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరులు ఓ ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి.. అడ్డుకున్న వారిపై దాడికి దిగటం తీవ్ర చర్చనీయాంశమైంది.
ప్రభుత్వ స్థలంపై కన్ను: కర్నూలు ఓల్డ్ సిటీలోని.. అర్బన్ బ్యాంకు ఎదురుగా చింత నరసింహయ్య కుటుంబం 40 ఏళ్లుగా నివాసం ఉంటోంది. ఈ ఇంటికి తూర్పు వైపు నగరపాలక సంస్థ స్థలం ఉంది. ఈ స్థలంలోంచే నరసింహయ్య కుటుంబం రాకపోకలు సాగిస్తోంది. ప్రభుత్వ స్థలంపై కన్నేసిన కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అనుచరుడు ఇంతియాజ్.. ఎలాగైనా ఆక్రమించాలని నిర్ణయించుకున్నారు. స్థలాన్ని ఆక్రమించి చిన్న గుడిసె నిర్మించి, గుడిసె ముందు నాపరాయి ఫ్లోరింగ్ సైతం చేయించారు. ఈ స్థలాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో.. నరసింహయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్థలాన్ని నగర పాలక సంస్థ స్వాధీనం చేసుకునేలా ఆదేశించాలని కోరారు.
అడ్డొచ్చిన వారిపై దాడి: ఇంతియాజ్ సైతం హైకోర్టుకు వెళ్లి తనకు ఇంజక్షన్ ఆర్డరు ఇవ్వాలని కోరారు. కానీ, తహసీల్దారు కార్యాలయం నుంచి తప్పుడు పత్రాలు సృష్టించారనే అభియోగంతో ఇంతియాజ్ పిటిషన్‌ను 2017 ఆగస్టు 18న హైకోర్టు కొట్టేసింది. ఎమ్మెల్యే తనకు అండగా ఉన్నారనే ధీమాతో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సైతం ధిక్కరించిన ఇంతియాజ్ గుడిసెను తొలగించి ఆ స్థలంలో రెండతస్తుల భవనాన్ని నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. నరసింహయ్య కుమారుడు లక్ష్మీనారాయణ, కోడలు శశికళ పనులు అడ్డుకున్నారు. దీంతో సుమారు 20 మందితో కలిసి వీరిపై దాడి చేశారు.