ADONI MEDICAL COLLEGE: కర్నూలు జిల్లా కేంద్రానికి ఆదోని పట్టణం వంద కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతంలో ఏవైనా ప్రమాదాలు జరిగినా అత్యవసర వైద్య సేవలు కావాలన్నా కర్నూలు వెళ్లాల్సి వస్తోంది. లేదంటే బళ్లారి, రాయచూర్ వెళ్లాల్సి ఉంటుంది. ఆదోని పట్టణంలోనే మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తే ఆలూరు, ఆదోని, కోసిగి, కౌతాళం, పత్తికొండ, ఏమ్మిగనూరు, మంత్రాలయం తదితర ప్రాంతాల ప్రజలకు ఎంతో దగ్గరగా ఉంటుంది. మెరుగైన సేవలు పొందటానికి వీలుగా ఉంటుంది. 2021 మే 31న రాష్ట్ర వ్యాప్తంగా 14 మెడికల్ కళాశాలలకు వర్చువల్ విధానంలో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇందులో ఆదోనిలో సైతం మెడికల్ కళాశాల ఉండటంతో స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది.
రెండేళ్లైనా..పునాది దాటలేదు:ఆదోని శివారులో ఎమ్మిగనూరు వెళ్లే మార్గంలో మెడికల్ కాలేజీ పనులకు శ్రీకారం చుట్టారు. 58 ఎకరాల విస్తీర్ణంలో వంద మెడికల్ సీట్లు, 450 పడకల సామర్థ్యంతో 475 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తామని ప్రకటించారు. సుమారు రెండేళ్లు కావస్తున్నా ఇంతవరకూ పనులు పునాదులు దాటలేదు. 2023 చివరి నాటికి మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకు వస్తామని ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించింది. ప్రస్తుతం పనులు జరుగుతున్న తీరును చూస్తే మరో మూడేళ్లు పట్టేలా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.