మరికొన్ని రోజుల్లో వైభవంగా పెళ్లి జరగాల్సిన ఆ ఇంట విషాదం నెలకొంది. శిరివెళ్ల మండలంలోని కోటపాడు వీరారెడ్డిపల్లె గ్రామశివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. గోస్పాడు మండలంలోని యాళ్లూరు గ్రామానికి చెందిన ఫకృద్దీన్, హుసేన్‌బీ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు హుసేన్‌వలీ(21) 7వ తరగతి వరకు చదువుకుని స్నేహితులతో కలిసి చుట్టు పక్కల గ్రామాల్లో గౌండాపనికి వెళ్తూ జీవిస్తున్నాడు. అతనికి డిసెంబర్ 9న నంద్యాల పట్టణానికి చెందిన ఓ యువతికి వివాహం జరగాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన పనుల్లో కుటుంబ సభ్యులు నిమగ్నమయ్యారు.
శనివారం రాత్రి శిరివెళ్ల గ్రామంలో కూలీ పని కోసం స్వగ్రామానికి చెందిన మహేంద్ర, ఉశేనిలతో కలసి ద్విచక్రవాహనంపై వెళ్తున్నారు. అదే సమయంలో శిరివెళ్ల నుంచి యాళ్లూరుకు వస్తున్న ట్రాక్టర్ ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ ముగ్గురు యువకుల్ని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా హుసేన్‌వలీ మృతి చెందారు. మిగిలిన ఇద్దరూ చికిత్స పొందుతున్నారు. పెళ్లి జరగాల్సిన కుమారుడు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో తల్లిదండ్రులు, బంధువుల్లో గుండెలవిసేలా రోదిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టినట్లు ఎస్సై సూర్యమౌళి ఆదివారం తెలిపారు.