YSRCP Garjana Sabha: మూడు రాజధానులకు మద్దతు పలకడం సహా కర్నూలు నగరంలో హైకోర్టు ఏర్పాటు చేయాలన్న డిమాండ్లతో.. అధికార వైసీపీ కర్నూలులో రాయలసీమ గర్జన సభ నిర్వహించింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గుమ్మనూరు జయరాం, ఉషశ్రీచరణ్, అంజాద్ బాషా సహా సీమ ప్రాంతానికి చెందిన వైసీపీ ఎమ్మెల్యేలు, విద్యార్థి ఐకాస, రాయలసీమ ఐకాస నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.
కర్నూలుకు హైకోర్టు రాకుండా చంద్రబాబు అడ్డుకుంటున్నారంటూ.. మంత్రులు తీవ్ర విమర్శలు గుప్పించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం మూడు రాజధానులు తలపెట్టినట్లు చెప్పారు. వెనుకబడిన న్న సీమ ప్రాంతానికి హైకోర్టుతోనే న్యాయం జరుగుతుందన్నారు. వికేంద్రీకరణతోనే అభివృద్ధి జరుగుతుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. కర్నూలు పేరును సినిమాల్లో వాడుకుని వేల కోట్లు సంపాదించిన సినీ పరిశ్రమ... హైకోర్టు ఏర్పాటుకు మద్దతివ్వాలని మరో మంత్రి జయరామ్ డిమాండ్ చేశారు.