కర్నూలు జిల్లా కోడుమూరు సమీపంలోని పదికోట్ల విలువైన స్థలం ఇది...వివాదంలో ఉన్న ఈ స్థలం వ్యవహారంలో పంచాయితీ చేసి సెటిల్‌చేస్తానంటూ నమ్మించి స్థానిక వైకాపా ఎమ్మెల్యే సుధాకర్ మోసం చేశారంటూ బాధితులు ఆరోపించారు. ఏకంగా తమ స్థలం మొత్తం అమ్మేసి డబ్బులు కాజేశారని బాధితులు అంటున్నారు. కర్నూలుకు చెందిన వజహద్ అలీ, ఇమ్రాన్ కుటుంబానికి మామిదాలపాడులో 10 కోట్ల విలువైన స్థలం ఉంది. గతంలో ఈ స్థలాన్ని ఇర్షాద్ సహా మరో నలుగురికి 2020 సెప్టెంబర్‌లో ఏడున్నర కోట్లకు విక్రయించి అడ్వాన్స్ తీసుకున్నారు. రిజిస్ట్రేషన్‌కు ముందే ఇరువురి మధ్య గొడవలు రావడంతో కేసు పోలీసుస్టేషన్ వరకు వెళ్లింది. ఇమ్రాన్ సోదరులు స్థానిక ఎమ్మెల్యే సుధాకర్‌ను ఆశ్రయించారు. తీరా చూస్తే తమ పని పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లయ్యిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
నమ్మించి నట్టేట ముంచడం అంటే ఇదేనేమో!.. 10కోట్లు విలువ చేసే భూమిని కొట్టేసిన వైసీపీ ఎమ్మెల్యే
పిల్లుల కోట్లాట కోతికి లాభమైనట్లుగా ఓ వివాదస్పద స్థలం పరిష్కరిస్తానంటూ పంచాయితీ చేసిన వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధి, ఏకంగా ఆ స్థలాన్నే కొట్టేశాడని.. తమకు తెలియకుండానే విక్రయించి డబ్బులు జేబులో వేసుకున్నాడని బాధితుల ఆరోపిస్తున్నారు. తగవు తీర్చమని వేడుకుంటే అసలకే మోసం వచ్చిందని బాధితులు బావురమన్నారు. ఇదేమి అన్యాయమని ప్రశ్నిస్తే,బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కర్నూలు జిల్లాకు చెందిన బాధితులు వాపోతున్నారు.
స్థల వివాదం పరిష్కరించినందుకు ఎమ్మెల్యే సుధాకర్ 30 లక్షల రూపాయలు కమిషన్ కోరారని...అందుకు అంగీకరించిన తాము.... ఉలిందకొండలో ఉన్న స్థలాన్ని ఆయన చెప్పిన వారి పేరిట రాసిచ్చామన్నారు. ఇర్షాద్ బృందం చెల్లించిన 4.20 కోట్లతో పాటు అదనంగా మరో 2.35 కోట్లు కలిపి మొత్తం 6 కోట్ల 55 లక్షలు చెల్లించాలంటూ తమతో బలవంతంగా ఒప్పించారని ఇమ్రాన్ సోదరులు తెలిపారు. తాము కూడా ఈ వ్యవహారం ఇక్కడితో వదిలించుకునేందుకు అంగీకరించినా....తమను మోసం చేసి మొత్తం స్థలం కొట్టేశారని బాధితులు తెలిపారు.
ఎమ్మెల్యే సుధాకర్ మోసంపై న్యాయస్థానాన్ని ఆశ్రయించామని బాధితులు తెలిపారు. పోలీసుస్టేషన్‌లో కేసులు పెట్టినా ఎఫ్‌ఐఆర్‌లో ఎమ్మెల్యే పేరు తొలగించారన్నారు. పోలీసుుల పట్టించుకోవడం లేదని వాపోయారు. ఎమ్మెల్యే నుంచి తమకు ప్రాణహాని ఉందని ఇమ్రాన్ సోదరులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరెవరో ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్ అక్రమాలపై విచారణ జరిపి...సీఎం జగన్ తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.
ఇది చదవండి: