Yaganti Temple in kurnool district: యాగంటి..! కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం ఎర్రమల అడవుల్లో ఉన్న ప్రముఖ శైవక్షేత్రం. ఈ ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు. యాగంటి దేవాలయ సమీపంలో ఉన్న విలువైన నాపరాయి ఖనిజ నిక్షేపాల కోసం మైనింగ్ మాఫియా మోతాదుకు మించి పేలుళ్లు జరుపుతోంది. ఫలితంగా ఎంతో ప్రాచీనమైన ఆలయ ప్రాంగణంలో కట్టడాలు దెబ్బతింటున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విజయనగర సామ్రాజ్య రాజు హరిహర బుక్కరాయులు 1336లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెప్తోంది. పోతులూరి వీరబ్రహ్మేంద్రరస్వామి వారు ఈ పరిసర ప్రాంతాల్లోనే కాలజ్ఞానాన్ని రచించారని స్థానికులు చెబుతారు. అలాంటి ప్రసిద్ధ ఆలయం నిబంధనలకు విరుద్ధంగా జరుపుతున్న పేలుళ్లతో ప్రమాద స్థితికి చేరుకుంది. మెట్ల మార్గం, ప్రధాన గాలిగోపురం దెబ్బతిన్నాయి.