ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తుంగభద్ర పుష్కరాలపై కరోనా ప్రభావం…?? - officials issued go about tungabhadra pushkara arrangements

ప్రతి పన్నెండేళ్లకోసారి వచ్చే తుంగభద్ర పుష్కరాల్లో పవిత్ర స్నానమాచరించేందుకు లక్షలాదిగా భక్తులు వస్తుంటారు. ఈసారి ఈ సంప్రదాయంపై కరోనా ప్రభావం పడింది. లక్షల్లో భక్తులు గుంపులుగా ఒక్కచోటకు చేరితే వైరస్‌ తీవ్రంగా వ్యాప్తి చెందుతుందనేది వైద్యారోగ్య శాఖ సూచన. దీంతో పుష్కర స్నానానికి అనుమతి లేదంటూ ఓ మెమో జారీ అయింది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పష్టత కోరుతున్నారు. మరోవైపు సంప్రదాయం కొనసాగేలా కరోనాను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికలు చేస్తోంది.

Corona effect on Tungabhadra pushkars ??
తుంగభద్ర పుష్కరాలపై కరోనా ప్రభావం…??

By

Published : Oct 31, 2020, 7:47 PM IST

తుంగభద్ర పుష్కరాలు నవంబరు 20వ తేదీ నుంచి డిసెంబరు 2వ తేదీ వరకు పన్నెండు రోజుల పాటు కర్నూలు జిల్లాలో నిర్వహించనున్నారు. దీనికోసం ప్రభుత్వం పుష్కర ఘాట్లకు, ఘాట్లు చేరుకోవడానికి రహదారులు, విద్యుత్తు, పచ్చదనం ఇలా అన్ని సౌకర్యాలకు నిధులు మంజూరు చేసింది. మొత్తం తుంగభద్ర పుష్కరాలకు రూ.207 కోట్లు కేటాయించారు. నవంబరు 13వ తేదీ లోగా ఘాట్లు, రహదారుల నిర్మాణం పూర్తిచేసేలా టెండర్లు దక్కించుకున్న గుత్తే దార్లకు ఆదేశాలిచ్చారు. పనులు సైతం వేగవంతమయ్యాయి.

ఆ ఉత్తర్వుతో సందిగ్ధం

వైద్య, ఆరోగ్య శాఖ సూచనల మేరకు తుంగభద్రలో పుష్కర స్నానానికి అనుమతి లేదని, పిండ ప్రదానం వంటి కార్యక్రమాలు ఏకాంతంగా నిర్వహించుకునేందుకు అవకాశం ఇస్తున్నట్లు, వివిధ జాగ్రత్తలు పాటించేలా దేవాదాయ శాఖ కార్యదర్శి ఈ నెల 22న మెమో జారీ చేశారు. ఇప్పటికే నిధుల కేటాయింపు, పనులు సాగుతున్న సమయంలో ఈ నిర్ణయంపై సందిగ్ధత నెలకొంది. కలెక్టర్‌ వీరపాండియన్‌ దీనిపై స్పష్టత కోరనున్నట్లు సమాచారం. కరోనా నేపథ్యంలో చేపడుతున్న చర్యల గురించి మరోసారి వివరించి, ప్రభుత్వ నిర్ణయం ప్రకారం నడుచుకునేందుకు సిద్ధమయ్యారు.

భక్తుల రద్దీ తగ్గించేలా...

కరోనా నేపథ్యంలో భక్తుల రద్దీని తగ్గించేందుకు జిల్లా అధికారులు ప్రయత్నిస్తున్నారు. పన్నెండేళ్ల లోపు, 60 ఏళ్లు పైబడిన వారు పుష్కరాలకు రావద్దని సూచించారు. దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే భక్తులు రాకపోవడమే శ్రేయస్కరమని అవగాహన కల్పిస్తున్నారు. ఈ-టికెట్‌ విధానం, స్లాట్‌లకు సమయం కేటాయింపు వంటి చర్యలతో గుంపులుగా భక్తులు చేరే అవకాశాలను నియంత్రించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే ఆ సమయానికి ఇవన్నీ కచ్చితంగా పాటిస్తారా? చేతులెత్తేస్తారో? చూడాల్సి ఉంది.

పుణ్యస్నానానికే మొగ్గు..

హిందూ సంప్రదాయబద్ధంగా తుంగభద్ర పుష్కరాల్లో అన్నీ జరుగుతాయని మరికొందరి అభిప్రాయం. బడ్జెట్‌లో సైతం దేవాదాయశాఖకు రూ.కోటి కేటాయించింది. ప్రతి రోజూ హారతులు, హోమాలు నిర్వహించేందుకు ప్రణాళికలు చేస్తున్నారు. దీనిని బట్టి పుష్కరాల్లో స్నానాలకు అవకాశం కల్పించేందుకే ఎక్కువ మొగ్గు చూపనున్నారు.

ఇవీ చదవండి: వైకాపా నాయకుని కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యేలు

ABOUT THE AUTHOR

...view details