ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం తాగించి.. రైలు పట్టాలపై పడుకోపెట్టి.. బంధువు సాయంతో కడతేర్చి - ap crime news

WIFE KILLED HUSBAND: ఆమె ఎంతో కాలం భర్త వేధింపులు తట్టుకుంది.. ఎన్నోసార్లు చేయి చేసుకున్నా సహించింది. ఎంతకీ భర్త తాగుడు మానకపోవడం,.. వేధింపులు ఆపకపోవడంతో విసుగు చెందింది. అతడిని హతమార్చాలని నిర్ణయించుకుంది ఇందుకోసం పథకం పన్నింది. బంధువు సహకారంతో భర్తకు మద్యం తాపించి.. అంతమొందించింది. తర్వాత తనకేమీ తెలియనట్లు.. తన భర్త కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది.. కానీ పోలీసుల విచారణలో నిజం బయటపడింది.

WIFE KILLED HUSBAND
WIFE KILLED HUSBAND

By

Published : Apr 10, 2023, 2:28 PM IST

WIFE KILLED HUSBAND : మద్యం ఎందరో జీవితాలను నాశనం చేస్తోంది. చాలా మంది ఆ మత్తుకు బానిసై.. తమ కుటుంబాలను పట్టించుకోవడం మానేస్తారు. అలాగే తాగొచ్చి భార్యలను శారీరకంగా, మానసికంగా హింసించేవారు ఎంతోమంది. అన్ని చేసినా చాలా మంది భార్యలు ఓర్పుతో.. తమ భర్తలను మార్చుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలో చాలా మంది సఫలం అయితే.. మరికొద్దిమంది విఫలం అవుతుంటారు. అయితే భర్తల ప్రవర్తనతో విసుగు చెందిన చాలా మంది వారిని దూరం చేసుకోవాలనో... అంతమొందించాలనో చూస్తుంటారు. దానికోసం సరైన పథకాన్ని రచించి.. దానిని అమలు చేస్తారు. ఇక్కడ కూడా ఓ మహిళ అలానే భర్త ప్రవర్తనతో విసుగు చెంది.. బంధువు సహకారంతో అతనిని చంపించింది. ఈ ఘటన కర్నూలు జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.

మంత్రాలయం సీఐ శ్రీనివాసులు ఈ హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. "కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన ఉప్పర నారాయణ (35), ఉప్పర వరలక్ష్మి భార్యాభర్తలు. తన భర్త కనిపించడం లేదని జూన్‌ 30, 2022న మాధవరం పోలీసుస్టేషన్‌లో వరలక్ష్మీ ఫిర్యాదు చేసింది. మే 27న కూలీ పనులకు వెళ్లి తిరిగి రాలేదని ఆ ఫిర్యాదులో పేర్కొంది. అయితే ఆ ఫిర్యాదుపై మిస్సింగ్​ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టాం. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, నారాయణ ఫోన్​ కాల్‌ డేటా, అనుమానితులను అదుపులోకి తీసుకుని కేసును విచారించాం.

నారాయణ మద్యానికి బానిసై.. భార్యను అనుమానిస్తూ.. రోజూ వేధించేవాడు. ఇతర మహిళల పట్ల, సొంత కూతురు పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో విసుగు చెందిన భార్య వరలక్ష్మీ.. భర్తను చంపాలని.. సి.బెళగల్‌ మండలం మారందొడ్డి గ్రామానికి చెందిన, తన సమీప బంధువైన చిన్న గోవిందు సహకారం తీసుకొంది. ఈ నేపథ్యంలో ముందుగానే రచించిన పథకం ప్రకారం చిన్నగోవిందు.. నారాయణను కర్నూలుకు తీసుకెళ్లి ఫుల్లుగా మద్యం తాగించి రైలు పట్టాలపై పడుకోబెట్టాడు. రైలు నారాయణ పైనుంచి దూసుకుపోవడంతో తలకు తీవ్రగాయాలై అతను అక్కడికక్కడే చనిపోయాడు. నారాయణ చనిపోయిన విషయాన్ని వరలక్ష్మికి చిన్నగోవిందు ఫోన్‌లో చెప్పాడు.

అంతకుముందే వేసుకున్న పథకం ప్రకారం తన భర్త కనిపించడం లేదని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించి సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా విచారణ చేయగా.. తామే ఈ హత్య చేసినట్లు వరలక్ష్మి, చిన్నగోవిందు అంగీకరించారు" అని తెలిపారు. నిందితులను అరెస్ట్‌ చేసి ఎమ్మిగనూరు న్యాయస్థానంలో హాజరుపరచినట్లు సీఐ తెలిపారు. అలాగే నిందితుల నుంచి హత్యకు ఉపయోగించిన ద్విచక్రవాహనం, నాలుగు చరవాణులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details