నంద్యాల పట్టణం నంద్యాల పురపాలక పరిధిలో గృహాలకు సంబంధించిన కుళాయి కనెక్షన్లు 40 వేలకుపైగా ఉన్నాయి. వీటిని 2012లో ‘ఆన్‌లైన్’ కిందకు మార్చారు. ఎనిమిదేళ్ల కిందట ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్ ప్రక్రియ చేసేటప్పుడు నాటి బిల్లు కలెక్టర్లు, మున్సిపల్ సిబ్బంది కొందరు చేతివాటం ప్రదర్శించారు. పన్నుదారుల నుంచి డబ్బులు వసూలు చేసినా మున్సిపాలిటీకి జమ చేయలేదు. ఆన్‌లైన్ చేసే క్రమంలో అసెస్‌మెంట్ సంఖ్యకు సంబంధించి బకాయి కింద కంప్యూటరీకరణ చేశారు. ఇవి తెలియని వినియోగదారులు యథావిధిగా పన్ను చెల్లిస్తూ వచ్చారు. కానీ పాత బకాయి అలాగే ఉండిపోయింది. ప్రస్తుతం ఇళ్ల ఆధునికీకరణకుగానీ, యజమాని పేరు మార్పునకు, విక్రయాల సమయంలో బకాయి ఉందంటూ పురపాలక దస్త్రాలు చూపిస్తుండటంతో గృహ యజమానులు కలవరపాటుకు గురవుతున్నారు.
అక్రమాలు ఇలా...
ఆఫ్‌లైన్ సమయంలో బిల్లు కలెక్టర్లు పట్టణంలో ప్రజల వద్దకే వెళ్లి ఆరు నెలలకు గానీ, ఏడాదికి గానీ కుళాయి పన్ను వసూలు చేసేవారు. 1990లో నెలకు కుళాయి పన్ను రూ.15, 2000లో రూ.30 నుంచి రూ.40 వరకు, ప్రస్తుతం రూ.80 ఉంది. ఇళ్ల వద్దకే వెళ్లి పన్ను కట్టించుకున్న నాటి బిల్లు కలెక్టర్లు పురపాలక సంఘానికి జమ చేయలేదు. 2012లో కంప్యూటరీకరణ జరిగిన సమయంలోనూ ఈ సొమ్ము చెల్లించలేదు. 10వ వార్డుతోపాటు 24, 2, 18, 9, 5, 15, 13, 11 వార్డులు, పాత పట్టణానికి చెందిన కొన్ని అసెస్‌మెంట్ల పన్నును దారి మళ్లించారు. 2013లో మున్సిపల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరగ్గా దస్త్రాలు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ ప్రమాదంపై అప్పట్లో అనుమానాలు సైతం తలెత్తాయి.
బయట పడుతున్న దందా
పట్టణీకరణ, ఆధునికీకరణ నేపథ్యంలో ప్రస్తుతం చాలా గృహాలు వాణిజ్య సముదాయాలుగా మారిపోతున్నాయి. ఇదే సమయంలో తల్లిదండ్రులు, భర్తల పేరు మీద ఉన్న అసెస్‌మెంట్లను మార్చుకునేందుకు మ్యూటేషన్ రుసుం చెల్లించి పని అయిపోయిందనుకుంటున్నలోపే కుళాయి పన్ను బకాయి అంటూ నంద్యాలలో కొత్త మాట వినిపిస్తోంది. 1992, 1993 సంవత్సరాలకు సంబంధించి బకాయిలు ఉన్నట్లు సిబ్బంది చెబుతుండటం గమనార్హం. 27 ఏళ్ల క్రితం బకాయి ఉంటే ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం నీటి పన్ను మాత్రమే ఎలా వసూలు చేస్తున్నారనే విషయమై సిబ్బంది నోరు మెదపకపోవడం గమనార్హం.
సుమారు 5 వేల గృహ సముదాయాలకు సంబంధించి ఇలా పన్ను దారి మళ్లింది. ఈ అక్రమాల సొమ్ము రూ.2 కోట్ల వరకు ఉంది. ఈ విషయం అప్పట్లోనే తెర పైకి వచ్చినా ఫలితం లేకపోయింది. సిబ్బంది చేసిన తప్పిదానికి ప్రస్తుతం జనం బాధ్యత వహిస్తున్నారు. పట్టణంలోని కొన్ని అసెస్‌మెంట్లకు నంబర్లు ఇవ్వకున్నా నీటి పన్ను పేరిట కొందరు సిబ్బంది డబ్బులు వసూలు చేసి మున్సిపాలిటీకి చెల్లించకుండా స్వాహా చేశారు. ఇప్పటి కూడా ఆ అసెస్‌మెంట్లకు సంబంధించి నీటి పన్ను వసూలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పట్టణంలో అసెస్‌మెంట్ కాని కుళాయిల సంఖ్య 9 వేల వరకు ఉండగా వీటి పన్ను దారి మళ్లుతోందన్న విమర్శలు ఉన్నాయి.
బకాయి ఉందంటే చెల్లించాల్సిందే :
పాత బకాయి ఉందని రికార్డుల్లో ఉంటే తప్పనిసరిగా చెల్లించాల్సిందే. ఆఫ్‌లైన్ సమయంలో బకాయిలు రూ.వేలల్లో ఉండదు. జమ కాని బకాయిలు 10 శాతం లోపే ఉండే అవకాశం ఉంది. బకాయిలపై సిబ్బంది నుంచి వివరాలు సేకరిస్తాం.-వెంకటకృష్ణ, మున్సిపల్ కమిషనర్, నంద్యాల
ఇదీ చదవండి:ఆధార్ సాయంతోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ!