కర్నూలు జిల్లా నందికొట్కూరు - మిడుతూరు మార్గ మధ్యలో ఉన్న హెచ్పీ పెట్రోల్ బంకులో పెట్రోల్ బదులు నీరు వచ్చింది. మిడుతూరు మండలం చెరుకుచెర్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు తన ద్విచక్ర వాహనానికి రూ. 510 రూపాయలు పెట్రోలు పట్టించాడు. కొద్ది దూరం వెళ్లగానే ద్విచక్ర వాహనం నిలిచిపోయింది. స్టార్ట్ చేస్తే ఇంతకీ స్టార్ట్ కాకపోవడంతో తోసుకుంటూ పెట్రోల్ బంక్ వద్దకు వచ్చాడు. తాను ఇప్పుడే పెట్రోల్ పట్టించానని.. వాహనం కొద్ది దూరం వెళ్లి నిలిచిపోయిందని అక్కడ పనిచేసే వర్కర్లకు తెలియజేశాడు.
తమకు సంబంధం లేదని వారు వారించటంతో అక్కడే ఉన్న వినియోగదారులు కలుగచేసుకుని పెట్రోల్ ను పరిశీలించారు. ట్యాంకు నుంచి పెట్రోల్ కు బదులుగా నీరు రావడంపై ఆశ్చర్యపోయారు. ఈ విషయమై బంకు యజమానిని నిలదీయగా తమ తప్పేమీ లేదంటూ వర్షాలు అధికంగా పడడం వల్ల ట్యాంక్ లోకి నీరు చేరిందని బుకాయించారు. అక్కడ ఉన్న వినియోగదారులు కల్పించుకోగా.. ద్విచక్ర వాహనానికి మరమ్మతు చేయించి ఇస్తామని హామీ ఇవ్వడంతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు.