నంద్యాల విజయ డెయిరీలోని మూడు డైరెక్టర్ల స్థానాల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేడు ఎన్నికలు జరుగనున్నాయి. మూడు స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు రంగంలో ఉన్నారు. ఇండ్ల రమణారెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, యర్రలింగన్నగారి మల్లికార్జున, యేలంపల్లి రంగారెడ్డి, సోముల వెంకట జగన్‌మోహన్‌రెడ్డి, సీమా రవికాంతరెడ్డి పోటీలో నిలిచారు. మొత్తం 81 మంది ఓటర్లు వీరి భవిష్యత్తును నిర్ణయించనున్నారు.
నంద్యాల డివిజన్ పరిధిలోని వివిధ పాల సహకార సంఘం అధ్యక్షులు ఓటింగ్‌లో పాల్గొననున్నారు. ఓటు వేయనున్న వారిలో గోస్పాడు మండలం నుంచి ముగ్గురు, రుద్రవరం మండలం నుంచి ఐదుగురు, శిరివెళ్ల నుంచి ఏడుగురు, ఆళ్లగడ్డ నుంచి ముగ్గురు, చాగలమర్రి నుంచి ఐదుగురు, వెలుగోడు నుంచి నలుగురు, గడివేముల నుంచి నలుగురు, పాణ్యం నుంచి ఆరుగురు, మహానంది నుంచి ఇద్దరు, బనగానపల్లి ఐదుగురు, కోవెలకుంట్ల నుంచి నలుగురు, దొర్నిపాడు నుంచి ముగ్గురు, సంజామల నుంచి ఏడుగురు, ఉయ్యాలవాడ నుంచి నలుగురు, కొలిమిగుండ్ల నుంచి ఒకరు, నంద్యాల నుంచి ఇద్దరు, బండిఆత్మకూరు నుంచి ఐదుగురు, ఆత్మకూరు నుంచి ఇద్దరు, మిడుతూరు నుంచి ఇద్దరు, అవుకు నుంచి ఒకరు, పాములపాడు నుంచి ముగ్గురు, నందికొట్కూరు, కోడుమూరు, కొత్తపల్లి, బేతంచర్ల మండలాల నుంచి ఒక్కొక్కరు చొప్పున తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఛైర్మన్ స్థానానికి ప్రత్యక్ష ఎన్నిక
విజయ డెయిరీలో మొత్తం 15 డైరెక్టర్ల స్థానాలు ఉన్నాయి. ఇందులో మూడు డైరెక్టర్ల స్థానాలకు సంబంధించి న్యాయస్థానంలో వ్యాజ్యాలు నడుస్తుండటంతో ఆ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతం మూడు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే ఎన్నికైన 9 డైరెక్టర్ల స్థానాల్లో నలుగురు తెదేపా, మరో నలుగురు వైకాపాలను బలపరుస్తున్నారు. ఒక డైరెక్టరు తటస్థంగా ఉన్నారు. ఎన్నికలు పార్టీలకతీతంగా పరోక్ష పద్ధతిలో జరుగుతున్నా ఛైర్మన్ స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థులు ఇద్దరు చేరో పార్టీ మద్దతుదారులుగా కొనసాగుతున్న విషయం బహిరంగ రహస్యమే. ప్రస్తుతం ఛైర్మన్ భూమా నారాయణరెడ్డి మరోసారి పోటీలో ఉన్నారు. ఇక ప్రస్తుతం జరుగుతున్న మూడు డైరెక్టర్ల స్థానాల నుంచి పోటీ చేస్తున్న ఎస్వీ జగన్‌మోహన్‌రెడ్డి, గంగుల విజయసింహారెడ్డిలను ఛైర్మన్ స్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. డైరెక్టర్ల ఎన్నికలు, ఓట్ల లెక్కింపు అనంతరం డైరెక్టర్లు ఛైర్మన్‌ను చేతులెత్తే పద్ధతి ద్వారా ప్రత్యక్షంగా ఎన్నుకోనున్నారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న మూడు డైరెక్టర్ల స్థానాల ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. డైరెక్టర్లుగా గెలిచే అభ్యర్థులే ఛైర్మన్ ఎన్నికల్లో కీలకం కానున్నారు.
ఓటరుకు మూడు ఓట్లు