కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పాలకుర్తి గ్రామంలో రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ బృందం... చౌక ధరల దుకాణాలపై దాడులు చేసింది. విజిలెన్స్ అధికారులు వచ్చిన విషయం ముందుగానే తెలుసుకున్న కొందరు డీలర్లు వెంటనే దుకాణాలకు తాళాలు వేసుకుని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 39వ దుకాణంలో విజిలెన్స్ ఎంపీడీవో లలితా బాయ్ సరుకుల నిల్వలను పరిశీలించారు. 5 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 88 కిలోల కంది బేడలు అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు దుకాణం పై కేసు నమోదు చేసినట్లు అధికారిని తెలిపారు.
అనంతరం మరో నాలుగు ప్రభుత్వ చౌక ధరల దుకాణాలకు తాళాలు వేసి ఉండటంతో విజిలెన్స్, రెవెన్యూ సిబ్బంది అక్కడ తిష్ఠ వేశారు. ప్రభుత్వ చౌక ధరల దుకాణం దగ్గర ఓ ఇంట్లో 77 సంచుల పీడీఎఫ్ బియ్యాన్ని సైతం అధికారులు గుర్తించారు. ఈ మేరకు అధికారులు మూతపడ్డ దుకాణాలకు తమ దగ్గర ఉన్న తాళాలు వేసి నిఘా పెట్టారు. అన్ని దుకాణాలకు సంబంధించిన డీలర్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత... ఏ మేరకు సరుకులు నిల్వ ఉన్నాయో తదితర పూర్తి వివరాలను వెల్లడిస్తామని విజిలెన్స్ ఎంపీడీవో పేర్కొన్నారు.