శ్రీశైలంలో విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో విజిలెన్స్ అధికారులు దేవస్థానం పరిపాలనా భవనానికి చేరుకున్నారు. రెవెన్యూ విభాగంలో దుకాణాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించి సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. భక్తులకు విక్రయించే లడ్డూలు, కల్యాణం లడ్డూల బరువు, నాణ్యతను పరిశీలించారు.
టోల్‌గేట్, వసతి సముదాయంలో గదుల బుకింగ్‌కు సంబంధించిన దస్త్రాలను తనిఖీ చేశారు. ఆలయం ముందు భాగంలో ఉన్న కొబ్బరికాయల గోదాము వద్దకు చేరుకుని పరిశీలించారు. డీఎస్పీ సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శ్రీశైలంలో విజిలెన్స్ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. దేవస్థానం రికార్డుల్లో లోపాలు ఉంటే ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పారు.