కరోనా మహమ్మారితో ప్రతి ఒక్కరి జీవితాలు తలకిందులయ్యాయి. కొలువులు పోగొట్టుకుని ప్రైవేటు ఉద్యోగులు, పనులు దొరక్క దినసరి కూలీలు జానెడు పొట్ట నింపుకొనేందుకు అవస్థలు పడుతున్నారు. ఇదిలా ఉంటే నిత్యావసర, కూరగాయల ధరలు మాడు పగిలేలా జనం నెత్తిన దరువేస్తున్నాయి. అరకొర సంపాదన ఎటూ చాలక సామాన్యులు పడుతున్న అవస్థలు అధికారులకు పట్టడం లేదు. ధరల నియంత్రణ కమిటీ ఉందా? లేదా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కర్నూలు జిల్లాలో కూరగాయల సాధారణ సాగు ఖరీఫ్‌లో 33 వేల హెక్టార్లు ఉంది. ప్రధానంగా ఉల్లి, టమాటా, మిర్చిలతోపాటు బీర, బెండ, చౌళకాయ, కాకర, వంకాయలు, గోరుచిక్కుడు, దోస కూరగాయలతోపాటు, మెంతి, కొత్తిమీర, తోటకూర, పాలకూరలు ఎక్కువగా సాగవుతాయి. జిల్లాలో కోడుమూరు, గోనెగండ్ల, దేవనకొండ, ఆస్పరి, పత్తికొండ, ఓర్వకల్లు, గడివేముల, పెదకడబూరు, ఆదోని, ఎమ్మిగనూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, మిడుతూరు వంటి చోట్ల కూరగాయల సాగు ఎక్కువ. కూరగాయలు నిల్వ చేసుకునేందుకు మల్టీ ఛాంబర్ శీతల గిడ్డంగులకు గతంలో ప్రతిపాదనలున్నా ఎక్కడా అమలుకు నోచుకోలేదు.
దళారులు రైతుల నుంచి పొలాల వద్దే తక్కువ ధరలకు కూరగాయలు కొని బహిరంగ మార్కెట్‌లో ఇష్టమొచ్చిన ధరలకు అమ్ముతున్నారు. జిల్లాలో కర్నూలు 3, ఆదోనిలో ఒకటి, నంద్యాలలో రెండు రైతు బజార్లు ఏర్పాటు చేసినా అక్కడ కూర్చొని అమ్మే రైతులు తక్కువగా ఉన్నారు. దళారుల నుంచి కొందరు వ్యాపారులు కొనుగోలు చేసి కాలనీల్లో ఇష్టమొచ్చిన ప్రదేశాల్లో కూర్చొని ఇష్టారాజ్యంగా ధరలు పెంచి అమ్ముతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు.
నల్లబజారుకు పడని కళ్లెం
కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో కొందరు వ్యాపారులు నిల్వలను నల్లబజారుకు తరలించి కృత్తిమ కొరత సృష్టిస్తున్నారు. ఈ కారణంతోనే ధరలు పది రోజుల వ్యవధిలో పెరిగాయి. మరోవైపు వర్షాలతో పంటలపై ప్రభావం పడటంతో దిగుబడి తక్కువ వస్తుందన్న ముందస్తు ఆలోచనతోనే నల్లబజారులో నిల్వలు పెడుతున్నారు. జిల్లాలో పండే మిర్చి, టమాటా, బీర, కాకర వంటి కూరగాయల ధరలు సైతం నియంత్రణ లేక నింగికెగిశాయి. జిల్లాలో రెండేళ్లుగా ఆహార సలహా సంఘ సమావేశం జరిగిన ఊసే లేదు. ఫలితంగా ధరల నియంత్రణకు అడ్డుకట్ట పడటం లేదు.