కర్నూలు నగరం నడిబొడ్డున కొత్త బస్టాండ్ సమీపంలో వ్యవసాయ మార్కెట్ ఉంది. ఇక్కడికి కూరగాయలు, ఉల్లి గడ్డలు, ధాన్యం అమ్ముకోవటానికి రోజూ ఎంతోమంది రైతులు వస్తుంటారు. కూరగాయల మార్కెట్లో నగరవాసులు, హోటల్ యజమానులు, కూరగాయల వ్యాపారులు శుభకార్యాల కోసం ఇక్కడే కాయగూరలు కొనుగోలు చేస్తుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న మార్కెట్లో పారిశుద్ధ్య నిర్వహణ సరిగ్గా లేకపోవటంతో దుర్గంధం వెదజల్లుతోంది. ఎటు చూసినా చెత్తతో నిండిపోయి కనిపిస్తోంది. పందులు, ఆవులు, కుక్కల సంచారంతో అధ్వానంగా ఉంది.
వర్షం పడితే చిత్తడే
సాధారణ రోజుల్లోనే మార్కెట్కు వెళ్లటానికి ఇబ్బందిపడాల్సి వస్తోంది. అదే వర్షాకాలంలో అయితే చిత్తడి చిత్తడిగా ఉంటుంది. కొద్దిపాటి వర్షం పడినా... బురదమయంగా మారుతుంది. మురుగువాసనతో ముక్కుపుటాలు అదిరిపోతాయి. కనీసం కొద్దిసేపు నిలబడటానికీ ఇబ్బందిగానే ఉంటుంది. అయినా తప్పనిసరి పరిస్థితుల్లో నగర ప్రజలు అక్కడే కూరగాయలు కొనుగోలు చేస్తుండగా... వ్యాపారులు బురదలోనే అమ్ముతున్నారు. ఎవరూ పట్టించుకోవటం లేదని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.