VEDAVATHI PROJECT : తాగు, సాగునీటికి అల్లాడుతున్న కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతాలకు వేదవతి ఎత్తిపోతల పథకం వరదాయిని వంటిది. ఈ ప్రాంతం మీదుగానే హంద్రీ, హగరి నదులు ప్రవహిస్తున్నా.. సరిగా ఉపయోగపడటం లేదు. దీంతో.. ఆలూరు, హాలహర్వి, హోలగుండ, చిప్పగిరి, ఆదోని, కౌతాలం మండలాల్లోని 80 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీటిని, 253 గ్రామాలు, రెండు మున్సిపాలిటీల్లోని 10 లక్షల మంది జనాభాకు తాగు నీరు అందించే లక్ష్యంతో.. 2019 జనవరిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది.
19 వందల 42.80 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో పాలనామోదం తెలిపింది. 54 ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో వేదవతినీ చేర్చింది. టెండర్లు పిలిచి పనులను అప్పగించింది. ప్రభుత్వం మారాక మూడున్నరేళ్లలో వేదవతి పనులు మందగించాయి. చేసిన పనులకూ ఇంతవరకు బిల్లులు చెల్లించింది లేదు. ఈ ప్రాజెక్టు డ్రాయింగ్, డిజైన్లు కేంద్ర ఆకృతుల సంస్థ వద్ద పెండింగులో ఉన్నాయని అధికారులు చెబుతుండటం.. ఆశ్చర్యం కలిగిస్తోంది.
"కాలువ వస్తుందే అంటే రైతులు అందరూ హర్షం వ్యక్తం చేస్తారు. గత ప్రభుత్వం 8 టీఎంసీలు కేటాయిస్తే.. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మాత్రం దానిని 3 టీఎంసీలకు కుదించింది. ఇది రైతులకు చాలా ఇబ్బందికరంగా ఉంది. దీనిపై ప్రభుత్వం స్పందించి రైతులకు మంచి చేయాలని కోరుకుంటున్నాం"-రామాంజనేయులు, రైతు