Tea: సహజసిద్ధమైన, రసాయనాల్లేని తేనీటిని అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్నా. నాకు టీ, కాఫీ అలవాటు లేదు. కానీ ఎక్కడికెళ్లినా అవి కాకుండా తాగేందుకు ఇంకేమైనా ఉన్నాయా అని వెతికేదాన్ని. మాది కర్నూలు జిల్లా మంత్రాలయం. సొంతంగా ఏదైనా చేయాలనేది నా కల. ఒక బ్రాండ్‌ను రూపొందించాలని ఉండేది. ఎంబీఏ, ఎంఏ సైకాలజీ చేసి ఉద్యోగంలో చేరా. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నవీన్‌తో పెళ్లైన తర్వాత హైదరాబాద్ వచ్చా. ఆ తర్వాత అద్విత్ పుట్టాడు. 30 ఏళ్లలోపే ఏదైనా సాధించాలన్నది నా ఆలోచన. మావారూ ప్రోత్సహించారు.
పానీయాలపై ఆసక్తి అన్నాను కదా, కొత్తరకాల టీలను చేద్దామనిపించింది. వయోబేధం లేకుండా అందరూ తీసుకొనేలా, ఆరోగ్యాన్ని అందించేలా మా టీ ఉండాలనుకున్నా. అప్పటికే ఎనిమిదేళ్లగా ఓ సంస్థ హెచ్.ఆర్. విభాగంలో చేస్తున్నా. ఉద్యోగం చేస్తూనే అధ్యయనం మొదలుపెట్టా. దేశంలో అన్ని టీ తోటలకూ తిరిగా. వాతావరణం, పంట, రుచిలో తేడా, టీ పొడి తయారీ నుంచి కాయడం వరకు అన్నీ తెలుసుకున్నా. విదేశీ రకాలూ రుచి చూశా. ఏడాది తర్వాత 2017లో ‘బ్రూస్ అండ్ బ్లెండ్స్’ మొదలు పెట్టా. ఈ పరిజ్ఞానం సరిపోదనిపించింది. మరిన్ని నైపుణ్యాల కోసం ‘ఆసియన్ స్కూల్ ఆఫ్ టీ’లో ‘టీ సొమెలియర్’ కోర్సు చేశా. -విద్యలత
నేను అభివృద్ధి చేసిన టీ శాంపిల్స్‌ను స్నేహితులకిచ్చేదాన్ని. వారి సూచనలకు అనుగుణంగా మార్పులు చేసే దాన్ని. నచ్చకపోతే మరో ఫార్ములా... ఇలా చేస్తూ వచ్చా. ఇక పూర్తి స్థాయిలో రంగంలో దిగాలని ఉద్యోగాన్ని వదిలేశా. ఒక కొత్తరకం టీ తయారీకి దాదాపు నెలన్నర పట్టేది. డార్జిలింగ్, అసోం, ఖాంగ్రా ఎస్టేట్స్ నుంచి ముడిసరుకు తెప్పిస్తుంటా. 15 రకాల టీలతో మొదలుపెట్టాను.
6 నెలల్లోనే 5 రకాల కాఫీలూ చేర్చా. ఇవన్నీ మార్కెట్‌లోకి పూర్తిగా రావడానికి ఏడునెలలు పట్టింది. సీజన్లకు తగ్గట్లు ప్రయోగాలు చేస్తుంటా. మా దగ్గర ఇప్పుడు 100 రకాల టీ, 25 రకాల కాఫీ పొడులున్నాయి. మిల్క్, వాటర్‌బేస్, వెల్‌నెస్ టీలతోపాటు చాలా రకాలున్నాయి. కొన్ని పొడులను మరిగే నీటిలో వేయగానే బెర్రీస్, బాదం పలుకులు తేలుతాయి. బ్లూమిన్‌బడ్ టీ క్షణాల్లో పూరేకల్లా విచ్చుకుంటుంది. కాఫీల్లో కోల్డ్ బ్రూ, ఇన్‌స్టెంట్, ఫిల్టర్ రకాలూ.. రెడీమేడ్ డికాక్షన్ మా ప్రత్యేకం. -విద్యలత