కర్నూలు జిల్లా వెల్దుర్తికి చెందిన డి.కృష్ణయ్య విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు. ఇతనికి వెల్దుర్తిలో 703-2 సర్వే నంబరులో 3.20 ఎకరాలు, 135 సర్వే నంబరులో 0.50 సెంట్ల భూమి ఉంది. స్వయంగా సాగుచేసుకుంటున్నారు. తనకు వారసత్వంగా వస్తున్న పొలాన్ని కుమారుడు సాయికృష్ణకు దానవిక్రయం చేసేందుకు డోన్ రిజిస్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఈ పొలంపై ఐసీఐసీఐ బ్యాంకులో రూ.8 లక్షల రుణం ఉందన్న విషయం బయటపడింది. తను పొలాన్ని ఎక్కడా తనఖా పెట్టలేదని, ఐసీఐసీఐ బ్యాంకులో తనకు కనీసం ఖాతా కూడా లేదని ప్రధానోపాధ్యాయుడు వాపోయారు. తన పేరుతో నకిలీ వ్యక్తులు రుణం పొందినట్లు భావించి కర్నూలులోని బ్యాంకుకు వెళ్లి విచారించారు.
12.20 ఎకరాలున్నట్లు చూపి రుణం
ప్రధానోపాధ్యాయుడికి 2 సర్వే నంబర్లలో మొత్తం 3.70 ఎకరాల భూమి ఉంది. సర్వే నంబర్ 703-2లో 3.20 ఎకరాలు, 195 సర్వే నంబరులో 9.00 ఎకరాలు ఉన్నట్లు నకిలీ పాసు పుస్తకం సృష్టించిన ఆగంతకులు బ్యాంకులో రుణం పొందారు. ఉన్న పొలంతో పాటు, లేని పొలాన్ని చూపి ఇతనికి తెలియకుండా రుణం తీసుకున్నారు.