నూనెపల్లిలో అనుమతుల్లేని అనధికార లేఅవుట్
నంద్యాలను జిల్లాగా ప్రకటిస్తారన్న వార్తలు వచ్చినప్పటి నుంచి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అధికార పార్టీ నేతల అండదండలతో అనధికార లేఅవుట్లు పుట్టగొడుల్లా వెలిశాయి. నిబంధనలకు నీళ్లొదిలి ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. రూ.కోట్ల విలువైన భూములను అనధికారకంగా అమ్ముతున్నారు. అయినప్పటికీ అధికారులు తీసుకుంటున్న చర్యలు శూన్యమే.
నంద్యాల ప్రాంతంలో భూముల ధరలు కొంతమేర పెరిగాయి. అన్ని రాజకీయ పార్టీల అధినేతలు ప్రత్యేక జిల్లాకు హామీలిచ్చారు. నంద్యాల భౌగోళిక స్వరూపం, వనరులపై ఇప్పటికే జిల్లా అధికారులు ఉన్నతస్థాయి కమిటీకి నివేదికలిచ్చారు. నంద్యాలలో ప్రభుత్వ కార్యాలయాలకు స్థలాలు, భవనాల ఎంపిక సైతం పూర్తైనట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రం కానున్న నంద్యాలలో స్థిరాస్తి వ్యాపారులు దందాకు తెర లేపారు. పట్టణ శివారుల్లో అనధికారక లేఅవుట్లు వేసి అమ్ముతున్నారు.
ఆక్రమించి.. అమ్మకాలు చేసి..
నంద్యాల పరిధిలో బాలాజీ కాంప్లెక్సు, ఫరూక్ నగర్, చిన్నచెరువు సమీప ప్రాంతం, జగజ్జననీ నగర్, రైతు నగరం, కానాల, చాబోలు, చాపిరేవుల, వెంకటేశ్వరపురం, పులిమద్ది, రాయమాల్పురం, పోలూరు, పీవీ నగర్, అయ్యలూరిమెట్ట, దీబగుంట్ల సమీపంలోని పొలాల్లో లేఅవుట్లు వేసి అమ్మకాలకు పెట్టారు. మహానంది మార్గంలోనూ లేఅవుట్ల సంఖ్య పెరిగిపోయింది. పైగా అసైన్డ్, వాగు పోరంబోకు, డీకేటీ వంటి విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని ప్లాట్లల్లో కలిపేశారు. ప్లాటు (5 సెంట్లు) రూ.25-30 లక్షల వరకు ధర పెట్టి అమ్ముతున్నారు. 40 అడుగుల రోడ్డు, పార్కుకు స్థలం, విద్యుత్తు లైన్లు, తాగునీటి సదుపాయాలు లేకుండానే అమ్ముతుండటంతో వినియోగదారులు నష్టపోతున్నారు.
గుర్తించనవి ఇంకెన్నో...
నంద్యాల పరిధిలో పట్టణ ప్రణాళిక అధికారులు కొత్తగా గుర్తించిన అనధికార లేఅవుట్లు 44 ఉన్నాయి. నూనెపల్లి పరిధిలో 25, నంద్యాల పట్టణ పరిధిలో 3, మూలసాగరం పరిధిలో 16 గుర్తించారు. వీటి కింద 169.14 ఎకరాలు ఉంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఎకరా రూ.3 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ధర పలుకుతోంది. మున్సిపాల్టీల పరిధిలో లేఅవుట్ రుసుం, అభివృద్ధి రుసుం కింద ఎకరాకు రూ.1.50 లక్షల ఆదాయం ఖజానాకు సమకూరాలి. ఇలా అనధికార లేఅవుట్లతో నంద్యాల మున్సిపాల్టీ పరిధిలో రూ.2.53 కోట్లు ఖజానాకు గండి పడినట్లే. పట్టణ ప్రణాళిక అధికారులు గుర్తించిన లేఅవుట్లు పదుల సంఖ్యలో ఉంటే ఇంకా గుర్తించనవి భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్‌ఆర్‌ఎస్ (లేఅవుట్ రెగ్యులైజేషన్ స్కీం) కింద గతేడాది గడువు తేదీకి 236 దరఖాస్తులందినట్లు అధికారులు చెబుతున్నారు.
జేబులు నింపితే నిబంధనల్లేవ్!
లేఅవుట్ వేసేందుకు నిబంధనల ప్రకారం పార్కు స్థలం, రోడ్లకు స్థలాలు వదలాలి. మున్సిపాల్టీకి ఫీజు, వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చేందుకు భూమార్పిడి రుసుం చెల్లించాలి. ఇవేవీ చెల్లించకుండా.. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా లేఅవుట్లు వేసి విక్రయాలు చేపడుతున్నారు. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు గండి పడుతోంది. పట్టణ ప్రణాళిక సిబ్బంది భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలివ్వాల్సిన సిబ్బంది భూ యజమానులతో కుమ్మక్కై జేబులు నింపుకొంటున్నారు. పైస్థాయి అధికారులు సైతం పర్యటనలు చేసి పరిశీలన చేయకుండా కిందిస్థాయి సిబ్బందిపై ఆధారపడటంతో అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. సాంకేతిక పరిజ్ఞానం (శాటిలైట్ టెక్నాలజీ) అందుబాటులో ఉన్నా ఉపయోగించుకోవడం లేదన్న విమర్శలున్నాయి.
జోరుగా రిజిస్ట్రేషన్లు
అనధికార లేఅవుట్లలోని ప్లాట్లను నిషేధిత జాబితాలో పెట్టి రిజిస్ట్రేషన్లు చేయకూడదని సబ్ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు. ఇప్పటికే మున్సిపాలిటీ అధికారులు, కుడా అధికారులు సబ్ రిజిస్ట్రార్‌కు అనధికార లేఅవుట్ల జాబితా ఇచ్చారు. కాగా డైరెక్టర్ నుంచి జాబితా వస్తేనే నిలుపుదల చేస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అనధికార లేఅవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్లు ఆగడం లేదు. కుడా పరిధిలో ఉన్న అయ్యలూరుమెట్ట 7, పెద్దకొట్టాల 7, చాబోలు 4, పొన్నాపురం, పోలూరులో ఒక్కోటి, బిల్లలాపురంలో రెండు చొప్పున మొత్తం 22 లేఅవుట్లపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైనట్లు కుడా వైస్‌ఛైర్మన్ వెంకటేశ్వరరెడ్డి తెలిపారు.
ఇదీ చూడండి:
కంటికి రెప్పలా కాపాడాల్సినవారే కాటేశారు