Students committed suicide: కర్నూలు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో శిక్షణ తీసుకుంటున్న విద్యార్థినులను ప్రిన్సిపల్ వేధిస్తుండటంతో ఇద్దరు ఆత్మహత్యకు యత్నించారు. బాధితుల కథనం ప్రకారం... కర్నూలు డీఎంహెచ్‌వో కార్యాలయ ప్రాంగణంలోని ప్రాంతీయ శిక్షణ కేంద్రంలో 30 మంది విద్యార్థినులకు మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్‌గా శిక్షణ ఇస్తున్నారు. వీరికి అక్కడే వసతి సౌకర్యం ఉంది. ఈ కోర్సుకు ప్రిన్సిపల్, వార్డెన్‌గా విజయ సుశీల వ్యవహరిస్తున్నారు. ఆమె నిత్యం వేధిస్తుండటం.. బొట్టు, గోరింటాకు పెట్టుకున్నా జరిమానా వేస్తుండటంతో విద్యార్థినులు ఇబ్బందులు పడేవారు.
దీనికితోడు వ్యక్తిగత సేవలన్నీ చేయించుకుంటున్నారు. ఎవరైనా మాట వినకపోతే ఫెయిల్ చేస్తానని బెదిరించేవారు. వేధింపులు ఎక్కువ కావడంతో శనివారం ఇద్దరు యువతులు ఫ్యాన్‌కు ఉరేసుకునేందుకు యత్నించారు. బాధితులు సోమవారం తమ సమస్యను ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపల్ లక్ష్మీనర్సయ్య దృష్టికి తీసుకెళ్లారు. ఆయన విజయ సుశీలను పిలిపించి వసతి గృహంలో ఉండకూడదని.. ఇల్లు చూసుకోవాలని చెప్పారు. తనపై ఫిర్యాదు చేయడంతో విజయ సుశీల ఆగ్రహం వ్యక్తం చేస్తూ విద్యార్థినుల వద్ద గతంలో తీసుకున్న లేఖలను బూచిగా చూపి తల్లిదండ్రులకు చెబుతానని హెచ్చరించారు.