కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం రాంపురంలో విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఎమ్మిగనూరుకు చెందిన మహబూబ్ బాషా, నెల్లూరుకు చెందిన వస్తాద్ స్నేహితులతో కలిసి మంత్రాలయంలో వివాహానికి హజరయ్యారు. అనంతరం 8 మంది స్నేహితులతో కలిసి సరదాగా తుంగభద్ర నదిలో ఈతకు వెళ్ళారు.
నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో అందరూ గల్లంతయ్యారు. అక్కడే ఉన్న గజ ఈతగాళ్ళు వారిని గమనించి వెంటనే స్పందించారు. ఆరుగురిని కాపాడగా.. మహబూబ్, వస్తాద్ నీటి ప్రవాహంలో గల్లంతై.. మృతి చెందారు. పోలీసులు మృతదేహాలను వెలికి తీసి శవపరీక్షల నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.