నది సాగితేనే మానవులకు మనుగడ. అలాంటి నదీ తీరంలోని గ్రామాల ప్రజలకు, రైతులకు వరప్రదాయనిగా తుంగభద్ర నిలుస్తోంది. వేణీ, మలప్రభ, ఘటప్రభ, భీమా నదులు కలుస్తున్న కృష్ణా నదిలో తుంగ, భద్ర కలవడం వల్ల షణ్ణదీ సంగమంగా పిలుస్తారు.పుష్కర సన్నాహాల్లో ఉన్న తుంగభద్రమ్మ జన్మస్థలం నుంచి కృష్ణమ్మ ఒడిలో చేరేంత వరకూ లక్షలాది ఎకరాల్ని సస్యశ్యామలం చేస్తూ కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగుల్ని నింపుతోంది. పడమటి కనుమల్లో గంగమూల వద్ద జన్మించే తుంగ, భద్ర నదులు వేర్వేరుగా 170 కిలోమీటర్ల పొడవునా ప్రవహించాకే అఖండ తుంగభద్రగా మారి కృష్ణమ్మలో కలిసే వరకూ అనేక ఆనకట్టలు, తటాకాల్లో సేద దీరి ముందుకు సాగుతోంది.
శివమొగ్గ జిల్లాలో తుంగా జలాశయం, భద్ర జలాశయం, గదగ జిల్లాలో సింగటలూరు ఎత్తిపోతల పథకం, ఆపై దిగువకు సాగి హొసపేటె వద్ద తుంగభద్ర జలాశయం మహానిర్మాణ జాబితాలో చేరేవే. అక్కడి నుంచి ప్రవహిస్తూ..రెండు రాష్ట్రాల మధ్య రాజోలిబండ మళ్లింపు పథకంతో మూడు ప్రాంతాల ప్రజలను పలుకరిస్తోంది. ఆ దిగువన మరెన్నో తటాకాలతో హరిత విప్లవానికి తనవంతు సహకరిస్తోంది. విజయనగర రాజుల కాలంలోనే దిగువన ప్రవహించే నీటిని ఏ విధంగా ఎత్తులో ఉన్న హంపీ ప్రాంతానికి నీటిని సమకూర్చవచ్చో ఆనాటి పాలకులు ఇంజినీరింగ్ ప్రతిభను చాటుకున్నారు. ఇప్పటికీ హంపీలో రాయ కాలువ, తుర్తు కాలువ, బసవణ్ణ కాలువ, విజయనగర రాజులకు సాగునీటి రంగంపై ఉండిన ఆసక్తికి నిదర్శనాలుగా ఉన్నాయి.
తుంగభద్ర నదుల జన్మస్థలం.. గంగమూల
శివమొగ్గ జిల్లా గాజనూరు వద్ద నిర్మించిన తుంగ ఆనకట్ట ద్వారా శివమొగ్గ జిల్లాకు, భద్ర జలాశయం వల్ల శివమొగ్గ, చిక్కమంగళూరు, దావణగెరె, హావేరి జిల్లాలకు, సింగటలూరు ఎత్తిపోతల పథకం వల్ల ముండర్గి, హూవిన హడగలి ప్రాంతాలు సస్యశ్యామలం అవుతున్నాయి. పడమటి కనుమల్లో కురిసే భారీ వర్షాలకు రాష్ట్రంలోనే మెదటగా భర్తీ అయ్యే జలాశయంగా ‘తుంగా’కు పేరుంది. హొసపేటె వద్ద నిర్మించిన భారీ జలాశయంతో బళ్లారి, రాయచూరు, కొప్పళ జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ జలాశయ ఆధారిత తుంగభద్ర కుడి దిగువ కాలువ, కుడి ఎగువ కాలువలు..కరవును పారదోలడానికి నిత్యం సహకరిస్తున్నవే.టీబీ జలాశయం నుంచి ఆర్డీఎస్ (రాజోలిబండ) వరకు 120 కి.మీ, ఆర్డీఎస్ నుంచి మంత్రాలయం వరకు 40కి.మీ, మంత్రాలయం నుంచి సుంకేసుల జలాశయం వరకు 60 కి.మీ, సుంకేసుల నుంచి సంగమేశ్వరం వరకు 115 కి.మీ మొత్తం 335 కి.మీ ప్రవహించి కృష్ణాలో కలుస్తోంది.
తుంగభద్ర జలాశయం..