TSRTC Electric bus: తెలంగాణ ఆర్టీసీకి వెయ్యి విద్యుత్తు బస్సులు రానున్నాయి. డీజిల్ వినియోగం, కాలుష్యాన్ని తగ్గించేందుకు బ్యాటరీ ఆధారిత విద్యుత్తు బస్సులకు కేంద్రప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్న విషయం తెలిసిందే. తయారీదారుల మధ్య పోటీని పెంచేందుకు తొలిసారిగా దేశంలోని పలు సంస్థల నుంచి కేంద్రం టెండర్లు ఆహ్వానించింది. ఆయా రాష్ట్రాల అవసరాల మేరకు బస్సుల టెండర్లను ఖరారు చేసింది. తెలంగాణకు వెయ్యి బస్సులను సరఫరా చేసే కాంట్రాక్టు జేబీఎం గ్రూప్, అశోక్ లేలాండ్ సంస్థలకు దక్కింది.
ఆర్టీసీ ఆ రెండు సంస్థలతో త్వరలో ఒప్పందం చేసుకోనుంది. అధికారులు ఇచ్చే ప్రమాణాల మేరకు ఏడాది వ్యవధిలో వెయ్యి బస్సులను అందచేయాల్సిన బాధ్యత గుత్తేదారులదే. కేంద్రం నిర్ణయం మేరకు.. హైదరాబాద్‌లో నడిపే బస్సులకు కిలోమీటరుకు రూ. 55, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 40 చొప్పున గుత్తేదారు సంస్థలకు ఆర్టీసీ చెల్లించాలి. ఆర్టీసీ తరఫున బస్సులో కండక్టర్ మాత్రమే ఉంటారు. టికెట్ల విక్రయం, ఛార్జీల వసూళ్లు మినహా ఇతర విషయాలేవీ ఆర్టీసీకి సంబంధం ఉండదు. డ్రైవర్ జీతం సహా రోజువారీ నిర్వహణ, మరమ్మతుల వంటి వ్యవహారాలన్నీ గుత్తేదారు చూసుకోవాలి. రాబోయే వెయ్యి బస్సుల్లో 500 హైదరాబాద్‌లో, మిగిలిన 500 నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం తదితర నగరాల్లో నడపాలని అధికారులు నిర్ణయించారు.