కరోనా నిబంధనల నడుమ తుంగభద్ర పుష్కరాలు మొదలయ్యాయి. నీటి ద్వారా కరోనా అధికంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం నదీ స్నానాలు నిషేధించింది. చిన్నారులు, వృద్ధులకు అనుమతి లేదని స్పష్టం చేసింది. జల్లు స్నానాలకు ఏర్పాట్లు జరిగినా... సర్కారు నిరాకరించింది. పూజలు, పిండప్రదానాలకు మాత్రమే అనుమతిచ్చింది.
పుష్కరాల్లో పాల్గొనేవారు ఈ-టికెట్ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలని... ఒక్కరోజు ముందుగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెబ్సైట్ను ప్రారంభించారు. కర్నూలు జిల్లాలో మొత్తం 23 పుష్కర ఘాట్లు ఏర్పాటు చేశారు. బృహస్పతి మకరరాశిలో ప్రవేశించిన వెంటనే పుష్కరాలు ప్రారంభమయ్యాయి.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయంలో మధ్వాచారం ప్రకారం పీఠాధిపతి సుబుదేందు తీర్థులు... ఉదయాన్నే తుంగభద్ర నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలను తుంగభద్రలో కలిపి... పుష్కరాలు ప్రారంభించారు. పీఠాధిపతి సహా పలువురు భక్తులు నదీస్నానాలు చేశారు. మధ్యాహ్నం కర్నూలులోని సంకల్ బాగ్ పుష్కర ఘాట్‌లో సీఎం జగన్... నదీమతల్లికి చీరాసారె సమర్పించి పుష్కరుడిని ఆహ్వానించారు. ప్రత్యేక పూజలు అనంతరం హోమంలో పాల్గొన్నారు.