ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కన్నపేగును కాదన్న కుమారుడు... రోడ్డునపడ్డ వృద్ధ దంపతులు - A SON HAS TAKEN OVER ALL THE PROPERTIES OF HIS PARENTS

'ఏట్లో పడి చావండి... మందు తాగి చావండి... ఉరేసుకు చావండి..' ఇవి ఓ దుర్మార్గపు కుమారుడు... తల్లిదండ్రులను వదిలించేందుకు రోజూ అనే మాటలు. సొంతిళ్లున్నా 2 నెలలుగా కిరాయి ఇంట్లో ఉన్నారు ఆ వృద్ధ దంపతులు. ఇప్పుడు ఆ ఇంటి యజమానుల ద్వారా తల్లిదండ్రులను బయటకు గెంటేయించాడు ఓ సుపుత్రుడు. ఎక్కడికి వెళ్లాలో పాలుపోక ఇంటి ముందే జీవనం సాగిస్తున్న వృద్ధ దంపతుల దీనగాధ ఇదీ.

కన్నపేగును కాదన్న కుమారుడు... రోడ్డున పడ్డ వృద్ధ దంపతులు

By

Published : Nov 22, 2019, 9:52 PM IST

కన్నపేగును కాదన్న కుమారుడు... రోడ్డునపడ్డ వృద్ధ దంపతులు

కాటికి చేరే దాకా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్నకొడుకు కాదు పొమ్మన్నాడు. దిక్కుతోచని వృద్ధ దంపతులు రోడ్డునపడ్డారు. చలికి వణుకుతూ బతుకుతున్న ఆ వృద్ధ దంపతులను చూస్తే మనసు కలిచివేయక మానదు. రెండెకరాల పొలం, ఇల్లు ఉన్నా.. రోడ్డునపడ్డ ఈ దంపతులను చూసి స్థానికులు చలించిపోతున్నారు. కానీ కర్కశ కొడుకు మనసు మాత్రం కరగడం లేదు.

తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామానికి చెందిన బత్కన(75), బతుకమ్మ(65) భార్యాభర్తలు. వీరికి నలుగురు సంతానం. ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు. దంపతుల పేరుపై రెండు ఎకరాల పొలం, ఒక ఇల్లు ఉన్నాయి. ఆస్తిని అనుభవిస్తున్న కుమారుడు తల్లిదండ్రులను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడు. నిత్యం తమను బయటకు వెళ్లిపోవాలని రోజూ కొడుకు, కోడలు హింసించేవారని వృద్ధులు కన్నీరు మున్నీరయ్యారు.

తాము పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసినా.. కుమారుని తీరులో మార్పు రాలేదని వాపోయారు. చివరకు పెద్దమనుషుల దగ్గర పంచాయితీ చేసి అద్దె ఇంట్లో పెట్టడానికి ఒప్పుకున్నాడని తెలిపారు. అద్దె ఇల్లు యజమానిని కూడా తమ కొడుకు భయభ్రాంతులకు గురిచేసి తమను ఖాళీ చేయించాడని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్కడికి వెళ్లాలో తెలియని ఆ వృద్ధులు 4 రోజులుగా ఇంటి ముందే జీవనం సాగిస్తున్నారు. అక్కడే వంట చేసుకుంటూ... చలికి వణుకుతూ.. ఉంటున్నారు. అయినా కొడుకు కనికరించకపోవడం అందరిని కలిచివేస్తోంది. ఎక్కడికైనా వెళ్లి చావండని... లేకపోతే తానే చంపేస్తానని కన్నకొడుకే బెదిరిస్తున్నాడని వారు వాపోయారు. ఎవరైనా కుమారుడికి నచ్చజెప్పేందుకు వెళ్తే వారిని కూడా తిడుతుండటంతో ఎవరూ ముందుకు వెళ్లట్లేదన్నారు.

ఉన్న ఒక్కగానొక్క కొడుకు తమను బాగా చూసుకుంటాడని అనుకున్న తల్లిదండ్రులకు... ఆ కొడుకే హింసించడం... కోడలు వంత పాడడం మానవత్వానికి మాయని మచ్చగా మారింది. ప్రభుత్వం కల్పించుకుని తమ పొలం, ఇల్లు తమకు ఇప్పించాల్సిందిగా ఆ వృద్ధ దంపతులు కోరుతున్నారు.

ఇవీ చూడండి : 'మాతృత్వాన్ని మరిచి కన్నతల్లిపై హత్యాయత్నం '

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details