Kurnool Medical College : వైద్య విద్యలో చేరి మంచి డాక్టర్లుగా స్థిరపడాలనేది విద్యార్థుల కోరిక. వైద్యులుగా సేవలు అందిచాలని విద్యార్థులు కలలు కంటుంటారు. అలాంటి వైద్య విద్యలోనూ అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. కర్నూలు వైద్య కళాశాలలో నిర్వహిస్తున్న సప్లిమెంటరీ పరీక్షలలో కలకలం చెలరేగింది. ఇన్విజిలేటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్.. గురువారం నిర్వహించిన పరీక్ష ప్రశ్నపత్రాన్ని సెల్ఫోన్లో చిత్రీకరించటం తీవ్ర దూమారాన్ని లేపింది. ఇన్విజిలేటర్ ఫొటో తీస్తుండగా చీఫ్ అబ్జర్వర్ గమనించి చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ విషయం ఆరోగ్య విశ్వవిద్యాలయం దృష్టికి వెళ్లటంతో సంబంధిత ఇన్విజిలేటర్‌ను.. యూనివర్శిటి అధికారులు విధుల నుంచి తప్పించారు.
ఈ నెల 25న వైద్య విద్యకు సంబంధించి సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే సప్లిమెంటరీ పరీక్షలలో భాగంగా గురువారం.. కర్నూలు వైద్య కళాశాలలో అనాటమీ పేపరు-2 పరీక్షను నిర్వహించారు. కర్నూలు మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ సాయి సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ పరీక్షకు నంద్యాలలోని పలు వైద్య కళాశాలలకు చెందిన 134 మంది విద్యార్థుల వరకు హాజరయ్యారు. కళాశాలలోని ఆడిటోరియంలో ఒక పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయగా.. మరోకటి ఎస్‌పీఎం డిపార్ట్మెంట్లో ఏర్పాటు చేశారు.
ఈ పరీక్షలకు సంబంధించి రెండు కేంద్రాలకు కడప వైద్య కళాశాల చెందిన శ్రీనివాస్ నాయక్ అనే అధ్యాపకులు.. కర్నూలు వైద్య కళాశాలలో అబ్జర్వర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డాక్టర్ చక్రపాణి యాదవ్ అనే డాక్టర్ ఇన్విజిలేటర్‌గా ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో విధులు నిర్వహిస్తున్నారు. గురువారం పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో చక్రపాణి యాదవ్.. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్ష పత్రాన్ని తన సెల్‌ఫోన్‌తో ఫోటో తీశారు. అనంతరం ఆ సెల్‌ఫోన్‌ను బయట పెడుతుండగా.. పరీక్షల చీఫ్ అబ్జర్వర్ గమనించి పట్టుకున్నారు. సెల్‌ఫోన్‌ను తనిఖీ చేశారు.