తుంగభద్ర పుష్కరాల్లో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు, స్టాళ్ల ఏర్పాటుకు మాత్రమే అనుమతిచ్చారు. కర్నూలు సంకల్‌బాగ్ సమీపంలోని ఘాట్ వద్ద పుష్కరాలకు సంబంధించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. స్వామీ వివేకానంద మఠం, రామకృష్ణ మఠం, శ్రీశైల దేవస్థాన, పురావస్తు శాఖల సహకారంతో పర్యాటక శాఖ ఎనిమిది స్టాళ్లను ఏర్పాటు చేయనుంది. వీటికి సంబంధించి రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని ఏపీటీడీసీ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఇంకా నిధులు మంజూరు కాలేదు.
కర్నూలుకు అందుబాటులో...
జిల్లాకే తలమానికమైన కొండారెడ్డి బురుజు నగర నడిబొడ్డున ఉంది. గత వైభవాలకు రుజువుగా మిగిలింది. సుందర స్వప్నాలను, విషాదఛాయలను తనలో దాచుకుని నేటికీ చెక్కు చెదరలేదు. నగరంలోని గోల్ గుమ్మజ్ దేశంలోనే అతిపెద్దది. ఆగ్రాలోని తాజ్‌మహల్, బీజాపూర్‌లోని గోల్ గుమ్మజ్‌ల కంటే పెద్దదిగా గుర్తించారు. దీన్ని నిర్మించి 400 ఏళ్లు దాటినా గుమ్మజ్ చెక్కుచెదర లేదు. తుంగభద్ర నదీ తీరంలో రోజా దర్గా హిందూ - ముస్లిం ఐక్యతకు చిహ్నంగా వెలుగొందుతోంది. కర్నూలుకు 5 కి.మీ. దూరంలో పంచలింగాలలో పంచ రూపాలతో పంచ లింగేశ్వరుడు ఉన్న ఈ ఆలయం పురాతనమైంది. కర్నూలు - అనంతపురం రోడ్డులో జగన్నాథగట్టు మహనీయమైంది. స్వయంభువుగా జగన్నాథస్వామి, భూదేవి, శ్రీదేవి సమేతంగా లింగాకారంలో వెలిసి ఉంటారు. కర్నూలుకు 21 కి.మీ. దూరంలో సహజ సిద్ధంగా ఏర్పడిన రాతివనాలున్నాయి. ఆసియాలోనే పెద్దవిగా ప్రసిద్ధి చెందాయి.
దృష్టిపెట్టక.... అభివృద్ధికి నోచుకోక
రాష్ట్రస్థాయిలో సందర్శకులను ఆకర్షించే మరో సహజ సిద్ధ గుహలు వాల్మీకి గుహలు. ప్యాపిలిలో సమీపంలో ఉన్న ఈ గుహల్లో సహజసిద్ధంగా వెలిసిన తొమ్మిది అడుగుల పుట్ట, పది అడుగుల ధ్వజస్తంభ ఆకారం, ఎదురుగా శివలింగాలు ఉండి భూలోక కైలాసంగా పేరుగాంచింది. ఈ గుహలపై ఇప్పటివరకు ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. అహోబిలంలో రోప్-వేకు రూ.7.50 కోట్లు కేటాయించినా అటవీ శాఖ అనుమతి లేక పనులు మొదలు పెట్టలేదు. కర్నూలుకు 8 కి.మీ. దూరంలో ఉన్న గార్గేయపురంలో బోటు షికారు, హోటల్ అందుబాటులోకి రావాల్సి ఉంది. రాతివనాలలో ఈతకొలను ప్రతిపాదనలున్నా పట్టించుకోలేదు. ఓర్వకల్లు మండలంలో నన్నూరుకు 15 కి.మీ. ఉన్న కేతవరం కొండల్లో పూర్వం ఆది మానవులు నివసించిన ఆనవాళ్లున్నాయి. ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోక...ఆనాటి ఆదిమవాసులు గీసిన చిత్రాలున్నాయనే విషయం ఎవరికీ తెలియని పరిస్థితి ఏర్పడింది.
నదీ తీరంలో....
తుంగభద్ర ఆంధ్రలోకి ప్రవేశించిన మేళిగనూరు నుంచి కృష్ణా నదిలో కలిసే సంగమేశ్వరం వరకు పర్యాటక శాఖ అభివృద్ధి చేయాల్సిన ప్రాంతాలు రెండున్నాయి. సుంకేసుల వద్ద బోటింగ్, వెయిటింగ్ లాంజ్, సమాచార కేంద్రం, తాగునీరు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. రూ.1.50 లక్షలతో ఓ రెస్టారెంట్‌ను నిర్మిస్తున్నారు. సంగమేశ్వరం వద్ద జిల్లా పర్యాటక మండలి ద్వారా రెస్టారెంట్‌ను ఇతరులకు లీజుకు ఇచ్చారు. పుణ్యక్షేత్రాల విషయంలో నదీ తీరంలో మంత్రాలయం, మేళిగనూరులో శ్రీరాముడు ప్రతిష్ఠించిన రామలింగేశ్వర ఆలయం, గురజాల, అలంపూర్, కొత్తపల్లి అరణ్య ప్రాంతంలో కపిలేశ్వరం సమీపంలో ప్రాచీనమైన సంగమేశ్వరం వంటి క్షేత్రాలు దర్శించుకోవచ్చు.