కర్నూలు జిల్లా శిరివెళ్లకు చెందిన షేక్ అప్ష అనే బాలిక అలిగి ఇంట్లో నుంచి వెళ్లి నంద్యాల రైల్వే స్టేషన్కు చేరుకుంది. టీవీ ఎక్కువగా చూస్తుందని తల్లి మందలించటంతో అలా చేసింది. పాపని గమనించిన పోలీసులు వివరాలు సేకరించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. తమ బిడ్డను సురక్షితంగా అప్పజెప్పిన రైల్వే పోలీసులకు వారు కృతజ్ఞతలు తెలిపారు.
నీటి సంపులో పడి చిన్నారి మృతి:
అనంతపురం జిల్లా మడకశిర మండలం ఆముదాలగొంది గ్రామంలో ప్రమాదవశాత్తు రెండేళ్ల చిన్నారి మృతి చెందింది. ఆడుకుంటూ బయటకు వెళ్లి సంపులో పడటంతో ఘటన జరిగింది. పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు, పాపని ఇంటి వద్ద ఉన్న అవ్వ దగ్గర వదిలి వెళ్లారు.
ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి, ఎంతసేపటికీ కనిపించకపోయేసరికి వెతకడం ప్రారంభఇంచారు. చివరకు నీటి సంపులో కనపడింది. చుట్టుపక్కల వారు బయటకు తీసి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప మరణించిందని డాక్టర్లు చెప్పటంతో తల్లిదండ్రులు భోరున విలపించారు. వారి రోదన అక్కడి వారిని కంటతడి పెట్టించింది. చిన్నారి మృతితో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈతకు వెళ్లి అనంతలోకాలకు:
ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలంలో ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. పాత అన్నాసముద్రం గ్రామానికి చెందిన తంగిరాల ఆదామ్ , మాకం సుందర్ సింగ్ గ్రామ శివారులో ఉన్న దెబ్బల వాగులో ఈతకు దిగి, ఊపిరాడక మునిగిపోయారు. విషయం తెలుసుకున్న స్థానికులు వారిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామన్నారు.
ఇదీ చదవండి: దిశ బిల్లును తిప్పిపంపిన కేంద్రం