కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్టు ద్వారా... డోన్ మున్సిపాలిటీతో పాటు కృష్ణగిరి, పత్తికొండ మండలాల్లోని సుమారు 100 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. రబీలో సుమారు 24వేల ఎకరాలకు సాగునీరు అందించాలి. మూడేళ్లుగా సరైన వర్షాలు లేక... ఈ ప్రాజెక్టు తాగునీటి అవసరాలకే పరిమితమైంది. ఆయకట్టు రైతులకు సాగునీరు అందక నష్టపోయారు.
గాజులదిన్నెకు జలకళ... ఈసారైనా తీరేనా రైతు కల..? - గాజులదిన్నె ప్రాజెక్టుకు భారీగా నీరు
కొన్నేళ్లుగా నీరు లేక వెలవెలబోయిన గాజులదిన్నె ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. ఇటీవల కురిసిన వర్షాలకు భారీగా నీరు చేరి... నిండుకుండను తలపిస్తోంది. మూడేళ్లుగా... తాగునీటి అవసరాలకు మాత్రమే పరిమితమైన ఈ ప్రాజెక్టు నుంచి... ఈ ఏడాదైన సాగు అవసరాలకు నీరు విడుదల చేస్తారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గాజులదిన్నె
ఇటీవల కురిసిన వర్షాలకు గాజులదిన్నె ప్రాజెక్టుకు భారీగా నీరు వచ్చింది. ఇప్పటికే 3 టీఎంసీల నీరు చేరింది. ఎగువ నుంచి వరద ఇంకా వస్తుండటంతో... ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యానికి చేరుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మూడేళ్లుగా పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయామని... కనీసం ఈ ఏడాదైనా సాగునీరు ఇవ్వాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.