రాజధాని అమరావతిపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో భాజపా ఎంపీ టీజీ వెంకటేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన... రాజధాని కొనసాగనీయబోమని కేంద్రంతో సీఎం జగన్ చెప్పారని వెల్లడించారు. 4 ప్రాంతాల్లో 4 రాజధానులు పెట్టే యోచనలో జగన్ ఉన్నారని తెలిపారు. దీనివల్ల నవ్యాంధ్ర రాజధాని అమరావతిపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. అమరావతిలో పెట్టుబడులు పెడితే ఉత్తరాంధ్ర, రాయలసీమ విడిపోవటం ఖాయమని... పెట్టుబడుల వికేంద్రీకరణ జరగటం మంచిదని టీజీ వెంకటేశ్ అన్నారు. జగన్ చేసే పనిని ప్రజలు హర్షిస్తారని భావిస్తున్నామని ఆశించారు.
'4 రాజధానులు పెట్టే యోచనలో జగన్ ఉన్నారు'
అమరావతిపై టీజీ వెంకటేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నవ్యాంధ్ర నిర్మాణాన్ని ఆపి 4 ప్రాంతాల్లో 4 రాజధానులు పెట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పారు.
టీజీ వెంకటేశ్
గోదావరి నీళ్లను శ్రీశైలానికి ఇస్తామనటం హాస్యాస్పదం అని ఆయన ఎద్దేవా చేశారు. కేసీఆర్‌తో ఎవరు కలిసినా నాశనం తప్పదని విమర్శించారు. అలాగే పోలవరం ప్రాజెక్టును ఆపడం మంచిది కాదని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. దీనిని వైఎస్ ప్రారంభించారని.. చంద్రబాబు కొనసాగించారని టీజీ వెంకటేశ్ పేర్కొన్నారు. అమరావతి మీదే దృష్టి పెట్టటంతో తెదేపా సహా లోకేశ్ కూడా ఓడిపోయారని ఆయన విమర్శించారు.
Last Updated : Aug 25, 2019, 5:31 PM IST