ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

3 నెలల క్రితం అదృశ్యం.. కుళ్లిన స్థితిలో మృతదేహం లభ్యం - కర్నూల్ తాజా నేర వార్తలు

Degree Student Died in Nizamabad: చేతికందొచ్చిన కుమారుడు.. కుటుంబానికి అండగా ఉంటాడని ఆ తల్లిదండ్రులు అనుకున్నారు. చదువు పూర్తైతే చేదోడువాదోడుగా మారుతాడని భావించారు. కానీ అంతలోనే కనిపించకుండా పోయాడు. మూడు నెలలపాటు ఆచూకీ వెతకడంతో పాటు... పోలీసులు, ప్రజాప్రతినిధులను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. కుమారుడు ప్రాణాలతో వస్తాడనుకుంటే కుళ్లిపోయిన స్థితిలో మృతదేహం దొరకడంతో తల్లడిల్లిపోతున్నారు.

మృతదేహం
srikanth death

By

Published : Dec 13, 2022, 1:25 PM IST

Updated : Dec 13, 2022, 3:49 PM IST

Degree Student Died in Nizamabad: కనిపించకుండా పోయిన తమ కుమారుడు ఎక్కడున్నా బాగుంటే చాలనుకున్న తల్లిదండ్రుల ఆశలు అడియాశలయ్యాయి. కనీసం చివరిచూపు చూసుకునేందుకు వీల్లేకుండా కుళ్లిపోయిన స్థితిలో కుమారుడి మృతదేహం లభ్యమైన ఘటన నిజామాబాద్‌ జిల్లాలో జరిగింది. ఖండ్‌గావ్‌కి చెందిన డిగ్రీ విద్యార్ధి శ్రీకాంత్ మూడు నెలల క్రితం కనిపించకుండాపోయాడు. లక్ష్మణ్ రావు- శివజ్యోతి దంపతుల కుమారుడైన శ్రీకాంత్‌ బోధన్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు.

సెప్టెంబర్ 23న రోజులాగే కాలేజికి వెళ్లిన యువకుడు కనిపించకుండా పోయాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు... అతని కోసం కుటుంబీకులు ఎంత వెతికినా ఆచూకీ దొరకలేదు. పోలీసు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల వద్ద మొరపెట్టుకున్నారు. ఈ క్రమంలో బోధన్-రుద్రూర్ ప్రధాన రహదారిపై... పసుపు వాగు ఒడ్డున కుళ్లిపోయిన స్థితిలో శ్రీకాంత్ మృతదేహం లభించింది. ఉరేసుకున్నట్టుగా ఘటనాస్థలంలో చెట్టుకు తాడు, కింద చెప్పులు, సంచి కనిపించాయి.

కుమారుడి మృతితో తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. బోధన్-రుద్రూర్ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. శ్రీకాంత్‌ని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అదే కళాశాలలోనే చదివే అమ్మాయి, శ్రీకాంత్‌ ప్రేమించుకున్నారు. ఇది ఇష్టంలేని అమ్మాయి కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌ను బెదిరించారని మృతుడి బంధువులు తెలిపారు. ఇంటికొచ్చి చంపేస్తామని బెదిరించారని.. ఆరోజు నుంచే శ్రీకాంత్ కనిపించకుండా పోయాడని తెలిపారు. ప్రస్తుతం మృతదేహం లభించిన ప్రాంతంలో గతంలో వెతికామని ఇప్పుడు అకస్మాత్తుగా ఎక్కడి నుంచి మృతదేహం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

ఆర్డీవో రాజేశ్వర్, డీసీపీ అరవింద్‌బాబు ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ధర్నాచేస్తున్న వారితో మాట్లాడి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆందోళన కొనసాగుతుండటంతో పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించారు. అన్ని అంశాలను పరిగణలోకి విచారణ చేస్తామని ఎవ్వరినీ ఉపేక్షించమని... ఆర్డీవో హామీ ఇచ్చారు. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని... కుటుంబ సభ్యుల ఆరోపణ మేరకు టాస్క్‌ఫోర్స్ పోలీసులకు కేసును అప్పగిస్తున్నామని డీసీపీ ప్రకటించారు. పోలీసులపై వస్తున్న ఆరోపణలని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అండగా ఉంటాడని భావించిన కుమారుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 13, 2022, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details