TDP leaders fire on Kurnool Legislative Assembly stolen votes: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతకొన్ని నెలలుగా దొంగ ఓట్ల వ్యవహారం కలకలం రేపుతూనే ఉంది. 26 జిల్లాల్లోని నియోజకవర్గాల ఓటర్ల జాబితాలు తప్పుల తడకలుగా దర్శనమిస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఓకే ఇంటి నెంబర్‌తో ఉన్న వందలాది దొంగ ఓట్లు వెలుగు చూస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రతిపక్షాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. పలుమార్లు ఉన్నతాధికారుల దృష్టికి, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అయినా ఎటువంటి ఫలితం లేకుండాపోవడంతో విపక్షాల నేతలు వాపోతున్నారు. వందేళ్లకు పైబడిన ఓటర్లు, ఏ చిరునామా లేని వారి పేర్లు జాబితాల్లో పెద్దదిగా ఉండటంతో ప్రతిపక్షాలు ఆందోళనకు గురవుతున్నాయి. తాజాగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే ఇంటి చిరునామాతో 152 దొంగ ఓట్లు బయటపడడం.. జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. జిల్లా కలెక్టర్, ఎలక్షన్ కమిషన్ తక్షణమే స్పందించి దొంగ ఓట్లను తొలగించాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
తప్పుల తడకగా ఓటర్ల జాబితాలు.. కర్నూలు శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఓటర్ల జాబితాలో భారీగా దొంగ ఓట్లుఉన్నాయని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేశాయి. నగరంలోని 17వ వార్డులో 69-03-1655 ఇంటి సంఖ్యతో 152 ఓట్లు ఉన్నాయని గుర్తించారు. ఆ ఇంటి నంబర్ జోహరాపురం ప్రాంతంలో ఉన్నట్లు జాబితాలో చూపిస్తున్నా.. ఎక్కడా కనిపించలేదని ఆగ్రహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను పరిశీలించినప్పుడు.. DXS-4417846 ఓటర్ ఐడీలో ఫాతిమా, DXS-3039807లో మాలిక్ బాషా.. DXS-3039732 ఓటర్ ఐడీలో ఎల్లప్ప, DXS-3039757లో కృష్ణా అనే హిందువుల పేర్లు ఉన్నట్లు గుర్తించమన్నారు. ఒకే ఇంటి నంబరులో ఇలా హిందూ ముస్లింల పేర్లు ఎలా ఉంటాయి..? అన్నదే సందేహంగా మారిందని వ్యాఖ్యానించారు.
ఓకే డోర్ నంబర్‌తో 122 ఓట్లు.. మరో డోర్ నంబర్ 9-1-179 ఇంట్లో ఏకంగా 122 ఓట్లు ఉన్నట్లు ప్రతిపక్షా నేతలు గుర్తించారు. ఇక్కడ కూడా ఒకే ఇంటి నంబరులో హిందూ, ముస్లిం ఓటర్లు ఉండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఇంటి చిరునామా ఉస్మానియా కళాశాల రోడ్డులో ఉన్నట్లు జాబితాలో ఉన్నప్పటికీ.. ఆ ప్రాంతంలో ఆ నంబర్ ఇళ్లు ఎక్కడా కనిపించలేదని తెలిపారు. ఇలా ఒకే ఇంటి చిరునామాతో 20 అంతకంటే ఎక్కువ కలిగిన ఓటర్ల సంఖ్యను పరిశీలిస్తే.. 8,248 ఓట్లు బయటపడ్డాయన్నారు. ఈ సందర్భంగా పలువురు విపక్షాల నేతలు మాట్లాడుతూ..''కర్నూలు నగరంలో 122 ఏళ్ల వయసున్న ఓటర్లు ఇద్దరు ఉన్నారు. 121 ఏళ్ల వయసున్న ఓటర్లు నలుగురు ఉన్నారు. వంద కంటే ఎక్కువ వయసున్న ఓటర్లు 32 మంది ఉన్నారు. 80 కంటే ఎక్కువ వయసున్న ఓటర్లు 2,633 మంది ఉన్నారు.. తప్పుల తడకగా ఓటర్ల జాబితా తయారు చేశారనడానికి ఇదే నిదర్శనం. ఇంటి చిరునామా లేనివి, నామమాత్రపు చిరునామా కలిగిన ఓటర్లు అధికంగా దర్శనమిస్తున్నాయి.'' అని నేతలు ఆరోపించారు.