ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాయలసీమ ప్రాజెక్టుపై సుప్రీం కోర్టుకు తెలంగాణ ప్రభుత్వం - రాయలసీమ ఎత్తిపోతలపై కేసు

రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులు రద్దు చేయాలని కోరుతూ.. తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఎలక్ట్రానిక్ విధానంలో పిటిషన్ వేసింది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను అడ్డుకోవాలని కోరింది. టెండర్ ప్రక్రియ చేపట్టకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది.

Rayalaseema lift irrigatrion scheme case
రాయలసీమ ఎత్తిపోతలపై సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ

By

Published : Aug 5, 2020, 11:58 AM IST

Updated : Aug 5, 2020, 12:54 PM IST

రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కృష్ణా నీటిని అదనంగా తరలించేలా వచ్చిన ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు టెండర్ ప్రక్రియ విషయంలో తదుపరి ముందుకెళ్లకుండా నిలువరించాలని కోరింది. శ్రీశైలం జలాశయం బ్యాక్ వాటర్ నుంచి కృష్ణా నీటిని అదనంగా తీసుకునేలా రాయలసీమ ఎత్తిపోతలను ప్రతిపాదించిన ఏపీ ప్రభుత్వం... అందుకు పరిపాలనా అనుమతులు ఇవ్వడంతో పాటు టెండర్ ప్రక్రియను చేపట్టింది.

కృష్ణాబోర్డుకు గతంలోనే ఫిర్యాదు

గతంలోనే ఈ విషయమై కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫిర్యాదు చేసింది. విభజన చట్టం ప్రకారం ఎపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులు చేపట్టరాదని, రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ముందుకెళ్లరాదని బోర్డు కూడా ఏపీకి స్పష్టం చేసింది. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై కేంద్ర జలాశక్తిశాఖ ఇవాళ ఎపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ప్రతిపాదించింది. అయితే ముందుగానే నిర్ణయించిన కార్యక్రమాల కారణంగా 20వ తేదీ తర్వాత సమావేశం నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. ఇదే సమయంలో రాయలసీమ ఎత్తిపోతల విషయమై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఉత్తర్వులను రద్దు చేయాలని వినతి

రాయలసీమ ఎత్తిపోతల వల్ల తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, సమైక్య రాష్ట్రంలోనే సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందని తెలిపింది. రాయలసీమ ఎత్తిపోతల ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు టెండర్ల విషయంలో తదుపరి ముందుకెళ్లకుండా చూడాలని కోరింది. ఈ మేరకు నిన్న ఎలక్ట్రానిక్ విధానంలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.

ఇదీ చదవండి: ఈనెల 14 వరకూ ఎక్కడివక్కడే.. రాజధాని తరలింపుపై హైకోర్టు స్టేటస్​కో

Last Updated : Aug 5, 2020, 12:54 PM IST

ABOUT THE AUTHOR

...view details