Yuvagalam : తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు రావటమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం మహాపాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పుర్తి చేసుకుంది. ఈ సందర్భంగా... ఆదోని పట్టణం జనసంద్రమైంది. ప్రజలు భారీగా తరలి వచ్చి రోడ్డుకు ఇరువైపులా బారులు తీరారు. యువనేతకు భారీగా పార్టీ శ్రేణులు, స్థానికులు ఘనస్వాగతం పలికారు. వివిధ వర్గాల ప్రజల సమస్యలు తెలుసుకుంటూ లోకేశ్.. తన నడకను ముందుకు కొనసాగించారు. ఆదోనిలోని సిరిగుప్ప క్రాస్ వద్ద పాదయాత్ర వెయ్యి కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
జనవరి 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో శ్రీకారం చుట్టిన ఈ పాదయాత్ర ఉక్కుసంకల్పంతో అవిశ్రాంతంగా లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. 400 రోజుల్లో 4వేల కిలోమీటర్లు చేరుకునే లక్ష్యంతో ఇప్పటి వరకూ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి అనంతపురంలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఉమ్మడి కర్నూలు జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగిన యువగళం పాదయాత్ర 77వరోజు ఆదోనిలో వెయ్యి కిలోమీటర్ల మైలురాయిని చేరుకుంది. రోజుకు సగటున 10కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించాలని తొలుత అనుకున్నా.. సగటున రోజుకు 13కిలోమీటర్లు మేర లోకేశ్ నడక సాగించారు.
అడుగడుగునా జన హారతి.. మండుటెండలను సైతం లెక్కచేయకుండా అడుగడుగునా వేలాది ప్రజలు యువనేతను కలిసి సమస్యలు చెప్తుండగా... మరికొందరు వినతిపత్రాల రూపంలో సమస్యలు తెలియజేస్తున్నారు. వివిధ వర్గాల ప్రజల నుంచి ఇప్పటివరకు 1,300 వినతిపత్రాలు యువనేతకు అందాయి. యువత, మహిళలు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, వివిధ సామాజికవర్గాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు తాము ఏం చేస్తామనేది స్పష్టం చేస్తూ లోకేశ్ ముందుకు సాగుతున్నారు.
అడ్డుకులు సృష్టించిన ప్రభుత్వం.. పాదయాత్ర ప్రారంభం నుంచీ లోకేశ్‌కు అడుగడుగునా ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తూనే ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రచారరథం మొదలు నిలబడే స్టూల్ వరకు పోలీసులు అన్నీ లాగేసి గొంతునొక్కే ప్రయత్నం చేశారు. కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభం మొదలు తంబళ్లపల్లి నియోజకవర్గం వరకు ప్రతి 20 కిలోమీటర్లకు ఒకటి చొప్పున మొత్తంగా 25పోలీసు కేసులు నమోదయ్యాయి. సగటున రెండురోజులకు ఒక కేసు చొప్పున బనాయిస్తూ వచ్చారు. ప్రచార రథం, సౌండ్ సిస్టమ్, మైక్, స్టూల్‌తో సహా అన్నింటినీ పోలీసులు సీజ్ చేశారు. లోకేశ్‌తో పాటు అచ్చెన్నాయుడు, కుప్పం పీఎస్‌లో మనోహర్, అమర్నాథ్ రెడ్డి, పులివర్తి నాని, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో సహా అనేక మంది తెలుగుదేశం నాయకులపై కేసులు నమోదు చేశారు.
లక్ష్యం దిశగా ముందుకు.. యువగళం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో యాత్ర పూర్తయ్యే సమయంలో జరిగిన 3 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుబి మోగించడంతో పాటు, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానంలో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోనూ వైఎస్సార్సీపీ నేతలు రెచ్చగొట్టినా ఏ మాత్రం సంయమనం కోల్పోకుండా యువగళం లక్ష్యం దిశగా ముందుకు సాగింది. తన ప్రసంగాల్లో భాగంగా స్థానిక ఎమ్మెల్యేల అవినీతి చిట్టాను ప్రజల్లో ఎండగట్టడంలో లోకేశ్ పైచేయి సాధిస్తూ వచ్చారు. రాష్ట్రంలో నాలుగేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనా వైఫల్యాలను ఎండగడుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తున్నారు. ప్రతి బహిరంగసభలో ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని బయటపెడుతూ ఆధారాలివిగో అంటూ సవాళ్లు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయా నియోజకవర్గాల్లో తాము ఏం చేస్తామో స్పష్టంగా చెప్తూనే.., వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థులను ఆశీర్వదించాలని కోరుతున్నారు.
పరిశ్రమల వద్ద సెల్ఫీలు.. పాదయాత్రలో భాగంగా లోకేశ్ తమ హయాంలో తెచ్చిన పరిశ్రమల వద్ద సెల్ఫీలు దిగుతూ విసురుతున్న సవాళ్లు అధికార పార్టీ నేతల్ని ఇబ్బంది పెట్టాయి. కియా, డిక్సన్, టీసీఎల్, జోహా కంపెనీల వద్ద సెల్ఫీలు దిగి.. తన హయాంలో తెచ్చిన పరిశ్రమలు ఇవంటూ సవాల్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ మూసివేసిన అన్న క్యాంటీన్లు, దిశ పోలీస్ స్టేషన్, ఫిష్ ఆంధ్రా పాయింట్ల వద్ద సెల్ఫీ దిగుతూ విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పూతలపట్టు, సత్యవేడు, పుంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం అక్రమాలంటూ పీఎల్ఆర్ కంపెనీకి చెందిన టిప్పర్లలో గ్రావెల్, ఇసుక ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న తీరును లోకేశ్ సెల్ఫీద్వారా బయటపెట్టారు. ధర్మవరం అసెంబ్లీ నియోజకర్గంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ధర్మవరం చెరువు, ఎర్రగుట్టలను ఆక్రమించి ఫామ్ హౌస్ నిర్మించారంటూ వీడియోలను విడుదల చేశారు. అదే నియోజకవర్గం నుంచి పొరుగురాష్ట్రాలకు తరలిస్తున్న ఇసుక లారీల వద్ద సెల్ఫీ దిగి అవినీతిని ఎండగట్టారు. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి పరిధిలో అక్రమ ఇసుక తవ్వకాలతో పాటు కర్నూలు జిల్లాలో పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, మంత్రి గుమ్మనూరు జైరామ్లకు సంబంధించిన అవినీతి ఆధారాలంటూ లోకేశ్ పలు డాక్యుమెంట్లను బహిర్గతం చేశారు.