Nara Lokesh Fires on Panyam MLA Rambhupal Reddy: పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి అవినీతి ఆధారాలను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బయటపెట్టారు. 100 కోట్ల వక్ఫ్ భూములను కొట్టేసిన పాపం రాంభూపాల్ రెడ్డిని ఊరికే వదలదని ఆయన హెచ్చరించారు. సర్వే నంబర్ 524 లో 10.64 ఎకరాల భూమిని కబ్జా చేసిన ఆధారాలను ఆయన బయటపెట్టారు. జగన్నాథగట్టును ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి మాయం చేస్తున్నారని ఆరోపించారు. స్పష్టంగా సర్వే నంబర్లతో సహా రాంభూపాల్ రెడ్డి, ఆయన అనుచరుల అవినీతిని బయటపెట్టారు.
దోచుకుంది చాలు, ఇక తిరిగి ఇచ్చేయండి, లేకపోతే ప్రకృతి వదిలిపెట్టదని లోకేశ్ అన్నారు. ఎన్నిసార్లు గెలిచాం అన్నది గొప్ప కాదు.. ఏం చేశాం అన్నది చెప్పే సత్తా ఉందా అని ఆయన ప్రశ్నించారు. తాను చేసిన ఏ ఒక్క ఆరోపణకు సమాధానం చెప్పకుండా కేవలం బూతులతో విరుచుకుపడటం ఎంత వరకూ సబబో ఆలోచించాలి అని ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కరప్షన్ రాంభూపాల్ రెడ్డి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన అన్నారు. రాయలసీమ నీటి ప్రాజెక్టులు కోసం టీడీపీ హయాంలో 11,700 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు.
రాయలసీమ క్యాన్సర్ గడ్డ జగన్ ఎంత ఖర్చు పెట్టాడో చెప్పే దమ్ము కరప్షన్ రాంభూపాల్ రెడ్డికి ఉందా అని లోకేశ్ నిలదీశారు. ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచినా టీడీపీ హయాంలో ఉమ్మడి కర్నూలు జిల్లాని ఎలా అభివృద్ది చేశామో తెలుసుకోవాలని ఆయన అన్నారు. అవినీతి రాంభూపాల్ రెడ్డి రాయలసీమ క్యాన్సర్ గడ్డ జగన్ని తిట్టాలని సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 స్థానాల్లో వైసీపీ ఎమ్మెల్యేలను, ఇద్దరు ఎంపీలను గెలిపించారన్న లోకేశ్.. జగన్ ఒక్క పరిశ్రమ అయినా తెచ్చాడా..? ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం అయినా చేసాడా..? అని ప్రశ్నించారు.