కర్నూలు రోడ్ షోలో చంద్రబాబు Chandrababu in Kurnool road show: జగన్ పాలనలో సర్వనాశనమైన రాష్ట్రాన్ని మళ్లీ కాపాడుకోవడానికి.. తెలుగుదేశం పార్టీని మళ్లీ గెలిపించుకోవాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పిలుపు నిచ్చారు. జగన్‌ను సాగనంపితేనే రాష్ట్రానికి మోక్షమన్న ఆయన.. తనను గెలిపించుకోలేకపోతే 2024 ఎన్నికలే చివరివి అవుతాయని స్పష్టం చేశారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు తీసేస్తారంటూ.. వైకాపా చేస్తోన్న ప్రచారాన్ని నమ్మొద్దన్న చంద్రబాబు.. ఇంకా మెరుగ్గా అమలు చేస్తానని చెప్పారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు మొదటి రోజు కర్నూలు జిల్లాలోని కర్నూలు నగరం, కోడుమూరు, ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో పర్యటించారు. బాదుడే బాదుడు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జగన్ పాలనలో ప్రజలు బతకలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలూ తీవ్రంగా నష్టపోయారన్నారు.
రాష్ట్రంలో కడుపు నిండా తిండి తినే పరిస్థితి లేదని.. కంటి నిండా నిద్రపోయే పరిస్థితి లేదని గుర్తు చేశారు. డోన్‌లో ఓ మంత్రి.. తెదేపా కార్యకర్త కాంపౌండ్ వాల్ కూల్చారన్న చంద్రబాబు.. అనవసరంగా జీవితాలను ఇబ్బందుల్లోకి తెచ్చుకోవద్దని పోలీసులకు హితవు పలికారు. కార్యకర్తల జోలికొస్తే తాటతీస్తానన్నారు. గుండ్రేవుల, ఆర్డీఎస్ ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చామని.. వాటిని జగన్ గాలికి వదిలేశారన్నారు. రోడ్లు పూడ్చలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడంట అని ఎద్దేవా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సంపద సృష్టికి ప్రధాన్యం ఇచ్చానన్న చంద్రబాబు.. ఎన్నో వినూత్న నిర్ణయాలతో దేశానికే ఆదర్శంగా నిలిచామన్నారు. విశాఖ పర్యటనలో డ్వాక్రా సంఘాల ఏర్పాటును ప్రధాని మెచ్చుకోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
ఓ సీనియర్ రాజకీయ నేతగా రాష్ట్రంలోకి ఎవరికి అన్యాయం జరిగినా తానే తొలుత స్పందిస్తానన్న చంద్రబాబు.. పవన్‌పై వైకాపా చేస్తున్న దాడులపైనా అదే రీతిలో సంఘీభావం తెలిపానన్నారు. రాష్ట్రాన్ని రాబందుల నుంచి కాపాడాలనే తన పోరాటమన్న చంద్రబాబు.. దానికి ప్రజల ఆశీర్వాదం కావాలన్నారు. 2024 ఎన్నికల్లో గెలిపించకపోతే అవే తనకు చివరి ఎన్నికలు అవుతాయని తేల్చిచెప్పారు. తాను అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఏవీ తీసేయనన్న తెదేపా అధినేత.. ప్రస్తుతానికన్నా మరింత మెరుగ్గా అమలు చేస్తానని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో రెండో రోజు ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాల్లో రోడ్ షోలు, బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొననున్నారు.
ఇవీ చదవండి: