Supreme judgment in Ahobilam temple case: కర్నూలు జిల్లాలోని అహోబిల మఠం ఆలయాన్ని చేజిక్కించుకోవాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రయత్నాలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయ నిర్వహణను.. అహోబిల మఠం, దేవాదాయశాఖ సంయుక్తంగా చేపడుతున్నాయి. ఆలయంలో సిబ్బందికి విధులు కేటాయించడం, భక్తులకు సౌకర్యాలు కల్పించడం.. హుండీ ఆదాయాలు, వేలం పాటల నిర్వహణ వంటి పరిపాలన విభాగాలను.. ప్రభుత్వం నియమించిన ఈవో చూసుకుంటున్నారు. సిబ్బందికి వేతనాలు పెంచడం.. నియామకాలు, తొలగింపులు తదితర పనులు మఠం పెద్దల చేతిలో ఉన్నాయి.
అయితే సిబ్బంది నియామకాలు, వేతనాలు వంటివి రాజకీయ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. గతేడాది సెప్టెంబర్‌లో సిబ్బందికి వేతనాల పెంపు విషయంలో వివాదం తలెత్తింది. విధులు కేటాయించడంలోనూ కక్ష సాధిస్తున్నారని, వాహన పూజల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి విషయాలపై మఠం నిర్వాహకులు, ఈవోల మధ్య తరచుగా వివాదాలు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో అహోబిలం ఆలయం తమకే చెందుతుందని గతేడాది.. అటు మఠం, ఇటు దేవదాయశాఖ హైకోర్టును ఆశ్రయించాయి.