Students Protest for Wanted Teachers at Kurnool District: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలోని గడివేముల మండలం కొరటమద్ది ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల కోరత తీర్చాలని విద్యార్థులు, తల్లిదండ్రులు నిరసన చేపట్టారు. పాఠాలు చెప్పేందుకు ఉపాధ్యాయులు లేక తమ పిల్లలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 'ఇక్కడ 1నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులున్నారు. వీరికి కేవలం నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. దానికితోడు డిసెంబర్ నుంచి ఇద్దరూ ఉపాధ్యాయులు రాకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది' అని విద్యార్థుల తల్లిదండ్రులంటున్నారు.
పిల్లలకు అన్ని సబ్జెక్టులు చెప్పించాలని కమిటీ ఛైర్మన్ రాముడుతో సహా విద్యార్థుల తలిదండ్రులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. పాఠశాల ముందు ప్లకార్డులతో నిరసన చేపట్టారు. పాఠశాలలో అన్ని వసతులు ఉన్నా.. ఉపాధ్యాయుల కొరతతో నాణ్యమైన విద్య అందడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశాన్ని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా.. పట్టించుకోవడం లేదన్నారు.
పాఠశాలలో 6,7,8 తరగతులకు నలుగురు టీచర్లు ఉండగా.. అందులో నాలుగేళ్లుగా గణితం, ఇంగ్లీష్, సైన్స్, సోషల్ సబ్జెక్టులు బోధించడంలేదు. కేవలం తెలుగు హిందీ మాత్రమే చెబుతున్నారు. గైడ్ ద్వారా పరీక్షలు రాస్తున్నామని తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఉపాధ్యాయులు తమను కొట్టిన సందర్భాలు ఉన్నాయని విద్యార్థులు తెలిపారు.