శ్రీశైల ఆలయ కుంభకోణాన్ని పోలీసులు ఛేదించారు. 2017 నుంచి 2020 వరకు... మూడేళ్ల కాలంలో కోట్లాది రూపాయలు కాజేశారని గుర్తించారు. వీఐపీ అభిషేకం, డొనేషన్, ఆర్జిత సేవలు సహా 150 రూపాయల టిక్కెట్ కౌంటర్లలో... ఈ అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలపగా.. దేవాదాయశాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ ఆధ్వర్యంలో ఓ కమిటీ, ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో మరో కమిటీని నియమించారు. దీనిపై ఇప్పటికే అదనపు కమిషనర్.. విచారణ పూర్తిచేశారు. ఆయన నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. డీఎస్పీ కమిటీ సమగ్ర విచారణ జరిపి కేసు వివరాలను తెలిపారు.
డీఎస్పీ వెంకట్రావు కమిటీ గత నెల 26వ తేదీన శ్రీశైలం చేరుకుని విచారణను ప్రారంభించింది. దేవస్థానంలో వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బందిని అదుపులోకి తీసుకుని సమగ్రంగా విచారించింది. మొత్తం 27 మంది ఈ అక్రమాలకు పాల్పడినట్లు తేల్చారు. 2 కోట్ల 12లక్షల రూపాయలను స్వాహా చేసినట్లుగా గుర్తించారు. గతంలో రెండు కేసులు, తాజాగా రెండు కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. వీఐపీ అభిషేకం టిక్కెట్లలో 14 లక్షల రూపాయల అక్రమాలపై ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన కేసు నమోదు చేసి... నాగేశ్వరరావు అనే ఉద్యోగిని అరెస్టు చేశారు.
ఏప్రిల్ 15వ తేదీన... విరాళాల కేంద్రంలో జరిగిన 56 లక్షల రూపాయల అవినీతిపై... మరో కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామిరెడ్డి, సత్యనారాయణ రెడ్డి అనే నిందితులను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ఆర్జిత సేవలు, 150 రూపాయల కౌంటర్లో జరిగిన కోటీ 42 లక్షల రూపాయల అవినీతిపై... గత నెల 25వ తేదీన రెండు కేసులు నమోదు చేశారు. ఈ రెండు కేసుల్లో మొత్తం 27 మందిని తాజాగా అరెస్టు చేసినట్లు వెంకట్రావు తెలిపారు.