శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి సంప్రదాయాన్ని అనుసరించి మల్లన్నకు అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని అన్ని విద్యుద్దీపాలను ఆర్పివేసి మల్లన్న ఆలయ విమాన గోపురానికి, ముఖమండప నందులకు పాగాలంకరణ చేపట్టారు. పృథ్వీ వెంకటేశ్వర్లు చూడముచ్చటగా, మల్లన్నను పెళ్లి కొడుకుగా ముస్తాబు చేసినట్లు పాగాలంకరణ చేశారు. పాగాలంకరణ ముగిసిన తర్వాత ఆలయ ప్రాంగణంలోని నిత్య కల్యాణ మండపంలో భ్రమరాంబ, మల్లికార్జునుల బ్రహ్మోత్సవ కల్యాణం బ్రహ్మాండంగా సాగింది.
శివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. శ్రీశైలం, మహానంది, యాగంటి, ఓంకారం, కాల్వబుగ్గ తదితర పరమ పవిత్ర క్షేత్రాల్లో విశేష పూజలు, అభిషేకాలు జరిగాయి. ముక్కంటిని తనివితీరా స్మరించి.. శుభాలు కలిగించాలని భోళా శంకరుడిని వేడుకున్నారు.