రాష్ట్ర దేవాదాయశాఖ 2002 నుంచి దేవాలయాల్లో రెగ్యులర్ ఉద్యోగాల నియామకంపై నిషేధం విధించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవస్థానాల్లో పొరుగు సేవలకు పెద్దపీట వేస్తున్నారు. పొరుగు సేవల విధానం ద్వారా నియామకం అయ్యే సిబ్బందిలో బాధ్యత కొరవడడం, తక్కువ వేతనాలతో పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం వల్ల అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు.
శ్రీశైలం దేవస్థానంలో... పొరుగు సేవల్లో పనిచేసే సిబ్బందికి టిక్కెట్లు జారీ, నగదు సేకరణ వంటి కీలక బాధ్యతలు అప్పగించారు. దీనిపై ఎన్ని విమర్శలు వెల్లువెత్తినా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారు.
శ్రీశైలం దేవస్థానం పరిధిలో... లడ్డు, దర్శనం, టికెట్ విక్రయ కేంద్రాలను స్థానికంగా ఉన్న రెండు ప్రధాన బ్యాంకులకు అప్పగించారు. సదరు బ్యాంకులు ప్రైవేటు వ్యక్తులు, సంస్థలు నడిపే ఏజెన్సీల ద్వారా సిబ్బందిని నియమించుకున్నారు. ఈ క్రమంలో 2010లో లడ్డు విక్రయ కేంద్రంలో 10 లక్షల రూపాయలు స్వాహా చేసిన పొరుగు సేవల సిబ్బంది ఉదంతాన్ని స్థానిక ఆడిట్ అధికారులు గుర్తించారు.