12 నెలల్లో జరగాల్సిన విద్యుదుత్పత్తి... ఐదు నెలల్లోనే - updates in Srisailam Hydro Power Station
శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఐదు నెలల్లోనే లక్ష్యాన్ని చేరుకుంది. పన్నెండు నెలల్లో ఉత్పత్తి చేయాల్సిన 850 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఐదు నెలల్లోనే ఉత్పత్తి చేసింది.
శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తిలో లక్ష్యాన్ని సాధించింది. 2019-20 సంవత్సరానికిగానూ 850 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్న ప్రభుత్వం లక్ష్యాన్ని ఐదు నెలలకు ముందుగానే అందుకుంది.
ఈ సీజన్లో జులై ఆఖరు నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మొదలైంది. డెడ్ స్టోరేజి దశ నుంచి జలాశయం నీటిమట్టం త్వరితగతిన 885 అడుగులకు చేరింది. ఆగస్ట్ రెండో వారంలోనే గేట్లను తెరచి సాగర్‌కు నీటిని విడుదల చేశారు. ఆశించిన దానికంటే వరద ప్రవాహం జోరందుకుంది. ఇదే సమయంలో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో జులై నుంచి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించారు. విస్తృతంగా విద్యుదుత్పత్తి చేసే క్రమంలో ఒకటో నంబర్ యూనిట్లో సాంకేతిక సమస్య తలెత్తింది. మిగిలిన ఆరు యూనిట్లతో నిర్విరామంగా 850 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యాన్ని ఏపీ జెన్ కో ఇంజినీర్లు,సిబ్బంది సాధించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలోని నీటితో మరో 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.