Sri Raghavendra Swamy Temple : గురు రాఘవేంద్రుడి జన్మదినం రోజున మంత్రాలయంలో ఉత్సవాలు వైభవంగా జరిగాయి. కర్నూలు జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 428వ జన్మదిన వేడుకలు మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్ధుల ఆద్వర్యంలో ఘనంగా జరిగాయి. జన్మదినం సందర్భంగా పీఠాధిపతులు స్వయంగా వేకువ జామున స్వామి వారి మూల బృందావనానికి నిర్మల్య విసర్జన, వివిధ రకాల ఫలాలతో పంచామృత అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేసి మంగళ హారతి ఇచ్చారు.
వేలాది మంది భక్తులు: తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో హరినాథ్ స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక సంస్కృత పాఠశాల నుంచి మఠం అధికారులు స్వాగతం పలికారు. పీఠాధిపతులు తలపై మోస్తూ వస్త్రాలను బృందావనం ఎదుట ఉంచి పూజలు చేశారు. బృందావనాన్ని బంగారు ఆభరణాలు, విశేష పుష్పాలతో అలంకరించారు. జయ, దిగ్విజయ, మూల రాములకు పూజలు జరిపారు. అనంతరం స్వామి వెండి చిత్రపటాన్ని నవరత్న రథంపై కొలువుంచి వైభవంగా ఊరేగించారు. శ్రీ రాఘవేంద్ర స్వామి జన్మదినం కావడంతో స్వామి వారిని దర్శించుకొనేందుకు వేలాది మంది భక్తులు తరలి వచ్చారు.