శ్రీశైలానికి భారీ వరద కొనసాగుతుండటంతో బుధవారం సాయంత్రం గేట్లు తెరుచుకోనున్నాయి. ఇవాళ సాయంత్రం జలాశయం గేట్లు ఎత్తివేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 4,66,864 క్యూసెక్కుల వరద చేరుతుండగా.. 62,605 క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా నమోదవుతోంది. గరిష్ఠ నీటిమట్టం 885 అడుగులకు.. ప్రస్తుతం 879.30 అడుగుల మేర నీళ్లున్నాయి. గరిష్ఠ నీటి నిల్వ 215.807 టీఎంసీలకు ప్రస్తుతం 184.27 టీఎంసీలు ప్రాజెక్టులో చేరాయి. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి కొనసాగుతోంది.
2007 తర్వాత...
2007 తర్వాత మళ్లీ జులైలో శ్రీశైలం నిండి నీటిని విడుదల చేసే పరిస్థితి రావడం ఇదే తొలిసారి. మిగిలిన సంవత్సరాల్లో ప్రత్యేకించి ఆలమట్టి నిర్మాణం తర్వాత ఆగస్టు లేదా సెప్టెంబరులోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. అటు ఆలమట్టి, ఇటు తుంగభద్రల నుంచి భారీ నీటి విడుదలతో మంగళవారం సాయంత్రం 6 గంటలకు 4 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉంది. తుంగభద్ర కూడా నిండటంతో గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. గత ఏడాది లాగానే ఈ సంవత్సరం కూడా కృష్ణా, గోదావరిలోని అన్ని ప్రాజెక్టులు జలకళను సంతరించుకోనున్నాయి. మరో వారం రోజులు శ్రీశైలంలోకి ఇదే ప్రవాహం కొనసాగితే నాగార్జునసాగర్ కూడా నిండే అవకాశం ఉంది.
ఆలమట్టి నుంచి ప్రవాహం...
ఆలమట్టిలోకి 3.92 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండగా, మూడు లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలారు. ముందుజాగ్రత్తగా నీటినిల్వను తగ్గించారు. 129 టీఎంసీల సామర్థ్యం ఉండగా, 82 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉంచారు. దిగువన ఉన్న నారాయణపూర్ నుంచి 3.05 లక్షల క్యూసెక్కుల నీటిని జూరాలకు వదిలారు. జూరాల జలాశయంలోకి మంగళవారం సాయంత్రం 7 గంటలకు 3.28 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా 3.12 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. జలవిద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి పునఃప్రారంభమైంది.100.86 టీఎంసీల సామర్థ్యం గల తుంగభద్ర(కర్ణాటక)లో 96.31 టీఎంసీలు ఉంది. లక్షా 12 వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా 80 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. సుంకేసుల జలాశయానికి 1.07 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 22 గేట్లను ఎత్తి 1.06 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలానికి పెరిగిన వరద