రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం హిందూ వ్యతిరేక వైఖరిని అవలంబిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ముస్లింలు, క్రిస్టియన్లకు జీతాలు ఇవ్వడం, టిప్పు సుల్తాన్ విగ్రహాలు ఏర్పాటు చేయడం వంటివి ఇందుకు నిదర్శనమని చెప్పారు. పార్టీ సీనియర్ నేత విష్ణు వర్ధన్ రెడ్డి, తదితరులతో కలిసి శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి వార్లను ఆయన దర్శించుకున్నారు. ఆలయానికి సమీపంలోని ఘంటా మఠం పునర్నిర్మాణ పనులు, కొత్తగా నిర్మించిన లాలితాంబికా దుకాణాలను పరిశీలించారు.
ఎమ్మిగనూరులో హిందువులపై దాడులు చేస్తే కేసులు నమోదు చేసే దిక్కు లేదని మండిపడ్డారు. గోవులను రక్షించే చట్టం చెత్తదిగా అభివర్ణిస్తారా అని ప్రశ్నించారు. గోవుల చట్టంపై వ్యాఖ్యలు చేసిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యేపై సీఎం వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. శ్రీశైలంలో అన్యమతస్థుల దుకాణాలు ఉన్నాయని మండిపడ్డారు. వారి ఇళ్లను శ్రీశైలానికి దూరంగా నిర్మించాలని కోరారు.