Singareni Company New Record : తెలంగాణలోని సింగరేణి సంస్థ ఒక్కరోజు బొగ్గు ఉత్పత్తి, రవాణాలో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఈ నెల 28న ఉదయం షిఫ్టు నుంచి రాత్రి షిప్టు పూర్తయ్యే వరకు 24 గంటల వ్యవధిలో 2.46 లక్షల టన్నులు ఉత్పత్తి చేసి, 2.53 లక్షల టన్నులు రవాణా చేసినట్లు సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ తెలిపారు. ‘ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది కొత్త రికార్డు. ఈ నెల 20న నమోదైన రికార్డు(2.24 లక్షల టన్నుల ఉత్పత్తి, 2.35 లక్షల టన్నుల రవాణా)ను కార్మికులు తిరగరాశారు. బొగ్గు రవాణా కోసం 28న ఒక్కరోజే దక్షిణ మధ్య రైల్వే సహకారంతో గరిష్ఠంగా 44 సరకు రవాణా రైళ్లను వినియోగించాం.
28న సాధించిన రవాణా రికార్డులో మణుగూరు ఏరియా 64 వేల టన్నులు అందించి తొలిస్థానంలో, కొత్తగూడెం ఏరియా 51 వేల టన్నులతో రెండో స్థానంలో నిలిచింది’ అని సీఎండీ వెల్లడించారు. అందుకు కృషిచేసిన కార్మికులు, ఉద్యోగులు, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ ఏడాదికి నిర్ణయించిన 700 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు సమష్ఠిగా కృషిచేయాలన్నారు. ఈ ఏడాదికి ఇప్పటివరకు 2,591 రైళ్ల ద్వారా 465 లక్షల టన్నుల బొగ్గును సింగరేణి వినియోగదారులకు అందించిందని వివరించారు.