At Kurnool Taluka Urban Police Station robbery: ఇంట్లో ఎవరైనా దొంగతనానికి పాల్పడితే వెంటనే పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఫిర్యాదు చేస్తాం.. మరి ఆ పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం జరిగితే.. ఆ పోలీసులు ఎవరికి ఫిర్యాదు చేయాలి..? దొంగతనం చేసిన వారిని పట్టుకొని స్టేషన్‌లో బంధించాల్సిన పోలీసులు.. ఆ స్టేషన్‌లోనే దొంగతనం జరిగితే ఎవరిని బంధించాలి..?. సరిగ్గా అలాంటి ఘటనే కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఇటీవలే జరిగింది. ఏకంగా రూ. 75 లక్షల విలువైన వెండి ఆభరణాలు, నగదు మాయమైన ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.
105 కిలోల వెండి ఆభరణాలు, 2లక్షల 5వేల నగదు సీజ్: వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు తాలూకా అర్బన్ పోలీస్ స్టేషన్‌లో రూ. 75 లక్షల విలువైన వెండి ఆభరణాలు, నగదు మాయమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రెండేళ్ల క్రితం పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో.. తమిళనాడుకు చెందిన ఇద్దరు వ్యాపారుల నుంచి 105 కిలోల వెండి ఆభరణాలు, రూ. 2 లక్షల 5 వేల నగదును పోలీసులు సీజ్ చేశారు.
నిర్ఘాంత పోయిన సీఐ:సీజ్ చేసిన ఆ ఆభరణాలను, నగదును పోలీస్ స్టేషన్‌లో ఉన్న ఓ బీరువాలో దాచారు. ఈ క్రమంలో ఇటీవల సదరు యజమానులు న్యాయస్థానం నుంచి అనుమతి పొంది పోలీస్ స్టేషన్‌కు చేరుకుని వెండి, నగదు అప్పగించాలని కోరారు. దాంతో ప్రస్తుత సీఐ రామలింగయ్య బీరువా తెరిచి చూడగా.. బీరువాలో 105 కిలోల వెండి, నగదు లేకపోవడంతో నిర్ఘాంతపోయారు. సొత్తు సీజ్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు నలుగురు సీఐలు బదిలీ కావడంతో వారిని పిలిపించి విచారించటం మొదలుపెట్టారు. స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కొందరు సిబ్బందిపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.