దట్టమైన నల్లమల అడవుల్లో, కృష్ణానది ఒడ్డున.. జ్యోతిర్లింగం, శక్తిపీఠం ఒకేచోట వెలసిన భూలోకకైలాసమే శ్రీశైలం. ఇక్కడ పరమేశ్వరుడు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన మల్లికార్జున లింగంగా కొలువైతే, పార్వతీదేవి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన భ్రమరాంబికా దేవిగా దర్శనమిస్తోంది. మహాశివరాత్రి సమయంలో ఇక్కడ జరిపే బ్రహ్మోత్సవాలనూ, శివ పార్వతుల కల్యాణాన్నీ చూసేందుకు సుమారు పదిలక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఈ ఏడాది ఫిబ్రవరి 22 నుంచి మార్చి 4 వరకూ జరిగే ఈ వేడుకల్లో పాల్గొనేందుకు ఎందరో శివభక్తులు పాదయాత్ర చేసి మరీ శ్రీగిరిని చేరుకునేందుకు ఆసక్తి చూపించడం విశేషం.
శివ-శక్తి ఒకేచోట
కృతయుగంలో శిలాద అనే మహర్షి సంతానంకోసం శివుడిని పూజించాడట. పరమేశ్వరుడు అనుగ్రహించడంతో.. ఆ మహర్షికి ఇద్దరు కుమారులు కలిగారు. వారికి నందికేశ్వరుడు, పర్వతుడు అని పేర్లు పెట్టాడట. కొంతకాలానికి నందికేశుడు శివుని పూజించి స్వామికి వాహనంగా మారితే, పర్వతుడు కూడా తపస్సు చేసి.. తనపైన కొలువుదీరమంటూ స్వామిని వేడుకున్నాడట. ఆ పర్వతం పైనే శివుడు స్వయంభువుగా వెలిశాడనీ, అదే ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటనీ అంటారు. ఇక, దక్షయజ్ఞం సమయంలో.. తండ్రి వల్ల అవమానానికి గురైన సతీదేవి అగ్నిలో దూకి ఆత్మాహుతికి యత్నించగా శివుడు సతీదేవి శరీరాన్ని భుజాన వేసుకుని విలయతాండవం చేశాడు. ఆ ప్రళయాన్ని ఆపడం కోసం మహావిష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించడంతో ఆ భాగాలు పలుచోట్ల పడి ఆ ప్రదేశాలన్నీ శక్తిపీఠాలుగా వెలిశాయి. వాటిల్లో మెడ భాగం పడిన ప్రదేశమే శ్రీశైలమనీ.. అందుకే ఈ ప్రాంతాన్ని శివశక్తి క్షేత్రమనీ అంటారు.
ఇక్కడి ఆదిపరాశక్తికి భ్రమరాంబిక అనే పేరు రావడం వెనుకా ఒక కథ ఉంది. ఒకప్పుడు అరుణాసురుడు అనే రాక్షసుడు గాయత్రీ మంత్రాన్ని జపించి మరణం లేకుండా వరం పొందాడట. అది తెలిసి దేవతలు జగన్మాతను ప్రార్థించడంతో.. గాయత్రీమంత్రం జపిస్తున్నంతవరకూ అతడిని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పిందట. దేవతలు ఓ పథకం ప్రకారం తమ గురువైన బృహస్పతిని అరుణాసురుడి దగ్గరకు పంపించారు. అలా వెళ్లిన బృహస్పతి తాను కూడా గాయత్రీమాత భక్తుడినని అరుణాసురుడితో చెప్పడంతో.. దేవతలు పూజించే అమ్మవారిని తాను పూజించనంటూ ఆ రాక్షసుడు మంత్ర జపాన్ని ఆపేశాడు. అప్పుడు ఆదిపరాశక్తి భ్రమర (తుమ్మెద) రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టించిందట. అవన్నీ అరుణాసురుడినీ, అతడి సైన్యాన్నీ సంహరించడంతో అమ్మవారికి భ్రమరాంబిక అనే పేరు వచ్చిందనీ చెబుతారు.
రెండుసార్లు బ్రహ్మోత్సవాలు..
భూలోక కైలాసంగా గుర్తింపు పొందిన శ్రీక్షేత్రంలో ఏడాదికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తే.. మొదటి ఉత్సవాలను సంక్రాంతి సమయంలో.. రెండోసారి మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి సమయంలో నిర్వహిస్తారు. మొదటి రోజు సాయంత్రం ధ్వజారోహణ, భేరీ పూజ చేసి దేవతలను ఆహ్వానించి ఉత్సవాలను ప్రారంభించి, ఆ మర్నాటి నుంచీ ఆదిదంపతులకు రోజుకో వాహనసేవను నిర్వహిస్తారు. మహాశివరాత్రి నాడు లింగోద్భవ సమయంలో వేద పండితులూ, అర్చకులూ కలిసి మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకం, ఆ తరువాత శివపార్వతుల కల్యాణం.. చివరగా ప్రభోత్సవం, తెప్పోత్సవం నిర్వహించి ఈ ఉత్సవాలను ముగిస్తారు.
పట్టువస్త్రాల సమర్పణ.. పాగాలంకరణ
ఈ ఉత్సవాల్లో.. పార్వతీ పరమేశ్వరులకు రాష్ట్ర ప్రభుత్వంతోపాటూ తిరుమల తిరుపతి దేవస్థానం, విజయవాడలోని దుర్గామల్లేశ్వరస్వామి సన్నిధానం, కాణిపాకం దేవస్థానం నుంచీ పట్టువస్త్రాలు వస్తాయి. అలాగే శివపార్వతుల కల్యాణానికి ముందు అర్థరాత్రి 12 గంటల తరవాత పాగాలంకరణ పేరుతో 365 మూరల పొడవున్న పాగాను స్వామివారి గర్భాలయ విమానశిఖరం నుంచి ముఖమండపంపైన ఉండే నందులను కలుపుతూ అలంకరిస్తారు. కొన్ని సంవత్సరాల నుంచీ.. చీరాల పరిధిలోని హస్తినాపురానికి చెందిన పృథ్వి వెంకటేశ్వర్లు కుటుంబమే ఈ పాగాలంకరణను చేస్తోంది. వెంకటేశ్వరుల కుటుంబం భక్తిశ్రద్ధలతో రోజుకో మూర చొప్పున ఏడాది మొత్తం దీన్ని నేసి బ్రహ్మోత్సవాల సమయానికి ఆలయానికి తెస్తారు. ఇక, ఈ వేడుకలను చూసి తరించేందుకు ఎందరో భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి చేరుకుంటారు.