శ్రీశైలం ఆనకట్ట నిర్వహణ, మరమ్మతులకు నిధులిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం స్పందించట్లేదు. ఫలితంగా ఆనకట్ట భద్రతా కమిటీల సూచనలు అమలు కావడం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని లక్షలాది ఎకరాలకు సాగు, తాగునీరందించే బహుళార్థ సాధక ప్రాజెక్టు కీలక ఆనకట్ట నిర్వహణ నీరుగారుతోంది. గతేడాది మార్చి మొదటి వారంలో కేంద్రానికి చెందిన ఆనకట్టల భద్రత, నిపుణుల కమిటీ శ్రీశైలంలో పర్యటించింది. కమిటీ ఛైర్మన్ ఏబీ పాండ్య జలాశయ భద్రతకు తీసుకోవాల్సిన చర్యలపై కొన్ని సూచనలు చేశారు. ఇప్పటికి ఏడాది దాటినా ఒక్క అడుగూ ముందుకు పడలేదు.
విని వదిలేస్తున్నారంతే..
ఏటా పలు భద్రతా కమిటీలు శ్రీశైలం డ్యామ్‌ను పరిశీలిస్తున్నాయి. భవిష్యత్తులో ముప్పు తలెత్తకుండా ఉండేందుకు కొన్ని సూచనలు చేస్తున్నాయి. వాటిని ఇలా విని అలా వదిలేస్తున్నారు. వాటిపై సిఫార్సుల మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినా ఉపయోగం లేదు. కారణం నిధుల మంజూరుపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోవడమే. ప్రస్తుత ఏపీ సీఎం జగన్.. గతంలో ప్లంజ్ పూల్‌పై అప్పటి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతేడాది ప్లంజ్ పూల్ వద్ద చేపట్టాల్సిన అత్యవసర పనులపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లినా ప్రయోజనం కనిపించలేదు.
ప్రతిపాదనలకు నిధులేవి?
2009 వరదల్లో కొట్టుకుపోయిన అప్రోచ్ రోడ్డును నిర్మిస్తేనే భద్రత కమిటీల సూచనలను అమలుచేసే వీలుంటుంది. ఈ రహదారి పునర్నిర్మాణానికి రూ.40 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. ఇందులోనే ప్లాంకులు, కుడివైపు ఏర్పడిన ఖాళీలను పూడ్చాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఆప్రాన్‌ను బలోపేతం చేయడానికి మరో రూ.40 కోట్లకు ప్రతిపాదనలు పంపారు. చివరిగా ప్లంజ్ పూల్ గొయ్యిని అండర్‌వాటర్ కాంక్రీట్తో పూడ్చాల్సి ఉంది. దీనికోసం రూ.700 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపారు. పరిపాలనా అనుమతి వస్తే టెండర్లకు వెళతామని డ్యామ్ ఇన్‌ఛార్జి ఎస్‌ఈ వెంకటరమణయ్య తెలిపారు.